AP Employees : ఏపీలో దారుణం.. జీతాల కోసం విషం తాగిన ముగ్గురు చిరుద్యోగులు

చాలా మంది కుటుంబ అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారు.  ఈఎంఐలు కట్టలేక సతమతమవుతున్నారు. ఇంటి అవసరాల కోసం అప్పులుచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ పరిస్థితి దిగజారుతుండడంతో బలవన్మరణాలకు ఆశ్రయిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 29, 2023 6:20 pm
Follow us on

AP Employees : ఏపీలో ఉద్యోగులకు జీతాల కోసం పడిగాపులు తప్పడం లేదు. ఎప్పుడో ఒకటో తారీఖున అందాల్సిన జీతాలు మూడో వారం దాటితే కానీ అందని పరిస్థితి. నెలలో ఒకటో తేదీన సామాజిక పింఛన్లు అందిస్తున్న వైసీపీ సర్కారు.. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు మాత్రం సకాలంలో పింఛన్లు అందించలేకపోతోంది. ఇక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వెతలు చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి వేతనాలు అందించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వారు పడుతున్న యాతన వేతన అంతా ఇంతా కాదు. చేసేది లేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తాడేపల్లి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చెందిన ఉద్యోగులు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కొద్ది నెలలకు సంబంధించి ఇక్కడి ఉద్యోగులకు వేతనాలు అందలేదు. అధికారులను అడుగుతుంటే అదిగో ఇదిగో అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే తామేం చేయగలమని చేతులెత్తేశారు. సోమవారం విధులకు హాజరైన రంజిత్ అనే ఉద్యోగితో పాటు మరో ఇద్దరు కూల్ డ్రింక్స్ లో విషం కలిపి తాగారు. అపస్మారక స్థితికి చేరుకున్నారు. తోటి ఉద్యోగులు గమనించి హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించి వైద్యసేవందిస్తున్నారు. రంజిత్ అనే ఉద్యోగి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో తాడేప్లి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కలకలం రేగింది.

ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రభుత్వ ఉద్యోగి జీతానికి ఢోకా ఉండదు.. సగటు మనిషి ఆలోచన ఇది. కానీ వైసీపీ సర్కారు చర్యల పుణ్యమా అని అటువంటి పరిస్థితే లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం సగటు వేతనజీవుల మాదిరి జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. గత కొద్ది నెలలుగా వేతనాలు సకాలంలో అందక ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొన్నారు. నెలలో మూడో వారం దాటితే కానీ వేతనాలు జమకావడం లేదు. చాలా మంది కుటుంబ అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారు. ఈఎంఐలు కట్టలేక సతమతమవుతున్నారు. ఇంటి అవసరాల కోసం అప్పులుచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ పరిస్థితి దిగజారుతుండడంతో బలవన్మరణాలకు ఆశ్రయిస్తున్నారు.