Chandrababu 5 Schemes : ఏపీని అంధకారంలో నెట్టేస్తున్న జగన్.. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన జగన్.. అస్తవ్యస్తంగా మార్చేస్తున్న జగన్.. గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ సైడ్ నుంచి వినిపించిన మాటలివి. దీని వెనుక ఉన్న పరమార్ధం ఉచిత పథకాలు అని. సంక్షేమం మాటున రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని. మరో ముందుకు అడుగు వేసి శ్రీలంక మాదిరిగా మార్చేస్తున్నారని.. ఇలా టీడీపీ నుంచి ఎడాపెడా విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు టీడీపీ చేస్తున్నదేమిటి? ఉచిత పథకాలు వద్దని చెప్పి మీరు ప్రకటించినదేమిటి? ఇప్పుడు ఏపీ నుంచి ఇటువంటి అభ్యంతరాలే వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి స్లోగన్ నుంచి సంక్షేమం వైపు మళ్లిన చంద్రబాబుపై ముప్పేట దాడి ఎదురవుతోంది.
జగన్‌కు సంక్షేమ పథకాల లబ్ధిదారులు భారీ ఓటు బ్యాంక్‌గా మారారని చంద్రబాబు గ్రహించడం వల్లే ఈ పరిస్థితి. తాను కూడా అదే మార్గం పట్టాల్సిన అనివార్య దుస్థితి. అయితే ఇన్నాళ్లు ఆడిన మాటలు, విమర్శలే ఇప్పుడు ప్రతిబంధకంగా మారాయి. చంద్రబాబు ప్రకటించిన పథకాల్లో ఐదింటికి అయ్యే బడ్జెట్‌పై లెక్కలు వెలువడుతున్నాయి. చాలా మంది లెక్క కట్టి మరీ సోషల్ మీడియాలో ప్రశ్నలపరంపర కొనసాగిస్తున్నారు. వాటికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారని ప్రశ్నిస్తున్నారు. మున్ముందు ఈ లెక్కల అడగడం, ప్రశ్నల పరంపర ఎదురయ్యే అవకాశం ఉంది. సంక్షేమం విషయంలో పేలవ ప్రదర్శన ఉన్న చంద్రబాబు దీనిని అధిగమించడం కాస్తా కష్టమే.
18 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో అటువంటి వారు 1.25 కోట్ల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.1500 చొప్పున లెక్కేస్తే సుమారు రూ.1900 కోట్లు నెలకు అవసరమవుతుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.22,500 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి వుంటుంది. ఇక ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల విషయానికి వస్తే కోటిన్నర మంది తెల్లరేషన్‌కార్డుదారులకు సాయం అందించాల్సి వుంటుంది. సిలిండర్ రూ.850 చొప్పున మూడింటికి రూ.2500 చొప్పున రూ.3,750 కోట్లు భరించాల్సి వుంటుంది.నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 10 లక్షల మందికి ప్రతినెలా భృతి చెల్లించాల్సి వుంటుంది. నిరుద్యోగులకు ఏడాదికి రూ.3,600 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యానికి ఏడాదికి సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా రైతులను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 82 లక్షల మంది రైతులకు సాయం అందించాల్సి వుంటుంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.16,500 కోట్లు ఖర్చు చేయాలి.
చంద్రబాబు ఇన్నాళ్లు వల్లె వేసిన అభివృద్ధి అన్న నినాదం మరుగునపడినట్టే. కేవలం సంక్షేమ పథకాలకే ఏడాదికి లక్ష కోట్లు అవసరం అవుతాయి. ఇప్పుడు ప్రకటించిన ఐదు పథకాల అమలుకుగాను చంద్రబాబుకు ఏడాదికి కావాల్సిన బడ్జెట్ రూ.50వేల కోట్లు. ఇది కేవలం మొదటి విడత మేనిఫెస్టో మాత్రమే. దసరాకు రెండో విడత మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అది ఒక రూ.50 వేల బడ్జెట్‌కు తక్కువ కాకుండా పథకాలను ప్రకటిస్తారు.అంటే సంక్షేమ పథకాలకు ప్రతి ఏడాది రూ.లక్ష కోట్లు చొప్పున చంద్రబాబు ఖర్చు చేయడానికి నిర్ణయించారు. అయితే చంద్రబాబు గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాల గణాంకాలు పరిశీలిస్తే పేలవ ప్రదర్శ ఉంది. అటు ప్రజల్లో కూడా అదే అనుమానం ఉంది.