Cinema Ticket Prices: దేవుడు(హైకోర్టు) వరమిచ్చినా ఏపీలో టిక్కెట్ల ధరల పెంచేది లేదని పూజారి (ఏపీ సీఎం జగన్) డిసైడ్ అయ్యాడట.. దీంతో టాలీవుడ్ కు షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. హైకోర్టు తాజాగా సినిమా టిక్కెట్ల తగ్గింపు, ఆన్ లైన్ టికెటింగ్ పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది. టిక్కెట్లపై సినీ ఇండస్ట్రీకే పెత్తనం కట్టబెట్టింది. ప్రభుత్వ జోక్యాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లలో సినిమా టిక్కెట్ల ధరలపై తెలుగు సినీ పరిశ్రమ ఆనంద పడుతున్న వేళ వారికి షాకిచ్చేలా జగన్ సర్కార్ ముందుకెళ్లడం మింగుడుపడని వ్యవహారంగా మారింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును బుధవారం హైకోర్టులో సవాల్ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించడం టాలీవుడ్ కు షాకింగ్ గా మారింది.

సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించాలన్న జీవోను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును జగన్ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసి టాలీవుడ్ కు గట్టి షాక్ ఇచ్చింది. హైకోర్టు ముందస్తు నిర్ణయం తీసుకోకుంటే థియేటర్ యాజమాన్యాలు సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉందని ప్రభుత్వం తరుఫున న్యాయవాది వాదించారు. అయితే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు కాపీ తమకు అందలేదని డివిజన్ బెంచ్ తెలిపింది. దీనికి హైకోర్టు డివిజన్ బెంచ్ సమ్మతించింది. గురువారం కేసుగా స్వీకరించి పిటీషన్ ను విచారిస్తామని తెలిపింది.
ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొన్ని సినిమా థియేటర్ల యాజమానులు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ జీవో నెం. 35ను సస్పెండ్ చేస్తూ సినిమా థియేటర్లలో ప్రవేశానికి థియేటర్ యాజమాన్యాలు పాత ధరలను అనుసరించవచ్చని తీర్పునిచ్చింది. సినిమా టిక్కెట్ ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వ జోక్యం సరికాదని.. కొత్త సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ ధరలను నిర్ణయించే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉందని పిటీషనర్లు వాదించారు. ఆ వాదనకే హైకోర్టు మొగ్గు చూపింది.
అయితే టాలీవుడ్ పై ముందు నుంచి జగన్ సర్కార్ సీతకన్ను వేసింది. అసలు టీడీపీ పుట్టిందే సినీ ఇండస్ట్రీ నుంచి.. ఎన్టీఆర్ ఈ పార్టీ వ్యవస్థాపకులు.అప్పటి నుంచే సినీ ప్రముఖులు టీడీపీ తరుఫున ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుస్తూ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇప్పటికీ చంద్రబాబుతో చాలా మంది సినీ ప్రముఖులకు దగ్గరి సంబంధాలున్నాయి.
Also Read: టికెట్ రేట్లపై నేడే విచారణ.. జగన్ సర్కార్ పంతం నెగ్గుతుందా..?
ఈ క్రమంలోనే వైసీపీకి చోటా మోటా సినీ ప్రముఖులు తప్ప ఇతరుల పెద్ద సినీ ప్రముఖుల నుంచి పెద్దగా సహకారం లేదు. ఒకానొక సమయంలో జగన్ సీఎం అయినా టాలీవుడ్ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. సన్మానాలు గట్రా చేయలేదు. పాత పగలన్నీ లోపల ఉంచుకున్నాడో కానీ జగన్ మాత్రం టాలీవుడ్ కు వ్యతిరేకంగానే వెళుతున్నారు. సినిమా టిక్కెట్ల తగ్గింపు, ఆన్ లైన్ విధానంతో షాకిచ్చాడు. ఇప్పుడు హైకోర్టు దాన్ని కొట్టివేసినా డివిజన్ బెంచ్ కు వెళుతూ టాలీవుడ్ కు షాకిచ్చాడు. టాలీవుడ్ ను వదలా అంటూ ముందుకెళుతున్నాడు. మరి ఇది ఎటువైపు దారితీస్తుందనేది వేచిచూడాలి.
Also Read: జస్టిస్ చంద్రు కామెంట్స్ మీద చంద్రబాబు క్లారిటీ.. అందుకే అలా అన్నారట..!