Article 370 Movie : గల్ఫ్ దేశాలు ఆర్టికల్ 370 సినిమాను ఎందుకు బ్యాన్ చేశాయి? అందులో ఏముంది?

ఈ సినిమాలో ఆర్టికల్ 370 ఎత్తివేత, దాని వెనుక జరిగిన కసరత్తు గురించి దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. గల్ఫ్ దేశాలలో ఈ చిత్రంపై నిషేధం విధించిన నేపథ్యంలో.. ఈ సినిమా నిర్మాతలు ఎటువంటి కామెంట్స్ చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

Written By: NARESH, Updated On : February 26, 2024 10:08 pm
Follow us on

Article 370 Movie : కాశ్మీర్లో ఒకప్పటి పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఆదిత్య సుహాస్ జంబలే ఆర్టికల్ 370 (article 370) అనే సినిమాను తెరకెక్కించాడు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. అక్కడ శాంతిభద్రతలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ సినిమాను రూపొందించారు. యామి గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవలి, వైభవ్, కిరణ్ కర్మాకర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యామి గౌతమ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించింది.

వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను ఆదిత్య సుహాస్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వసూళ్ళు కూడా భారీగా వస్తున్నాయని ఈ చిత్రాన్ని నిర్మించిన జియో స్టూడియోస్, బీబీ 6 స్టూడియోస్ చెబుతున్నాయి. ఇండియాలో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రానికి గల్ఫ్ దేశాలు బ్రేక్ వేశాయి. పాకిస్తాన్ కు సంబంధించిన కొన్ని సున్నితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్న నేపథ్యంలో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గల్ఫ్ దేశాలలో ఒక భారతీయ సినిమాను విడుదల చేయాలంటే అక్కడి సెన్సార్ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గత నెలలో హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఫైటర్ సినిమా విడుదలైంది. ఆ సినిమాపై కూడా గల్ఫ్ దేశాలు నిషేధం విధించాయి.

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యామి గౌతమ్ ఈ సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. ఆమెలో ఉన్న నటిని గుర్తించి దర్శకుడు ఈ సినిమాకు సరిగ్గా వాడుకున్నాడు. పోరాట సన్నివేశాల్లో ఆమె అద్భుతంగా నటించింది. కాశ్మీర్ లోని ఓ మాజీ టీచర్ కొడుకు బురాన్ వని ఆచూకీ కనుగొనే సన్నివేశాల్లో.. ఎన్కౌంటర్ చేసే సన్నివేశాల్లో యామి గౌతమ్ సూపర్ గా నటించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే రాజేశ్వరి పాత్రలో ప్రియమణి నటించింది. ఈ సినిమాలో ఆర్టికల్ 370 ఎత్తివేత, దాని వెనుక జరిగిన కసరత్తు గురించి దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. గల్ఫ్ దేశాలలో ఈ చిత్రంపై నిషేధం విధించిన నేపథ్యంలో.. ఈ సినిమా నిర్మాతలు ఎటువంటి కామెంట్స్ చేస్తారో వేచి చూడాల్సి ఉంది.