KCR Satire On AP: దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ నేతలు మళ్లీ టార్గెట్ చేస్తున్నారు. ఏడాది క్రితం తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఏపీ అభివృద్ధిపై వ్యాఖ్యానించారు. తన ఫ్రెండ్ సంక్రాంతికి ఆంధ్రాకు వెళితే.. అక్కడి రోడ్లు అధ్వానంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడని, ఎలాంటి అభివృద్ధి జరుగడం లేదని తనతో చెప్పాడని వెల్లడించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దుమారం లేపాయి. అప్పటి వరకు మిత్రులుగా ఉన్న బీఆర్‌ఎస్, వైసీపీ మంత్రలు విమర్శలు గుప్పించుకున్నారు. తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో ఆంధ్రాను కించపర్చడాన్ని తప్పు పట్టారు. తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. తాజాగా మళ్లీ మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ ఏపీని టార్గెట్ చేస్తున్నారు. కావాలనే జగన్ సర్కాన్‌ను విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
మొన్న హరీశ్‌రావు..
ఏపీ ప్రభుత్వం, నాయకులపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి విమర్శలు చేశారు. గతంలో ఏపీ నాయకులు తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారన్నారు. ప్రతీరోజు కర్ఫ్యూ ఉంటుందని విమర్శించారని గుర్తుచేశారు. తెలంగాణ నేతలకు పాలన చేతకాదని కూడా అన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు పాలన చేతకాని నేతలు ఏపీ వారే అని విమర్శించారు. చేతకాని పాలనతో ఏపీ వెల్లకిలా పడిందని పేర్కొన్నారు. గతంలో కూడా హరీశ్‌రావు జగన్ సర్కార్‌పై విరమ్శలు చేశారు. ఏసీ సీఎం జగన్ కేంద్రం నుంచి అప్పుల కోసం మోదీ చెప్పినట్లు ఏపీలో మోటార్లకు మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు.
తాజాగా కేసీఆర్..
తాజాగా హరీశ్‌రావు కూడా ఏపీ పాలకులను టార్గట్ చేశారు. సోమవారం గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ అక్కడ కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీ పాలనపై విమర్శలు చేశారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని భయపెట్టారని, కానీ ఇప్పుడు ఏపీనే అంధకారమైందని పేర్కొన్నారు. కేవలం 25 కిలోమీటర్లు వెళితే ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం ద్వారా గణనీయమైన అభివృద్ధి చేసుకున్నామని వెల్లడించారు.
యాదృశ్చికమా.. వ్యూహాత్మకమా..
ఏపీపై మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. నాలుగు రోజుల తేడాలో ఇద్దరూ ఏపీని టార్గెట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయస్థాయిలో రాజకీయాలు చేయాలని టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్ మొన్నటి వరకు మహారాష్ట్రపైనే దృష్టిపెట్టారు. అక్కడ ఇప్పటికే నాలుగైదు సభలు నిర్వహించారు. తాజాగా మధ్యప్రదేశ్ నేతలను కూడా బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీని కూడా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఏపీకి బీఆర్‌ఎస్ అధ్యక్షుడిని నియమించిన కేసీఆర్ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో అడుగు పెట్టేందుకే అక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది.