Presidential Elections 2022: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్కో బీజేపీ నేతకు ఒక దఫా మాత్రమే అధికారం ఇస్తున్నారు. గత మోడీప్రభుత్వంలో పనిచేసిన కేంద్ర మంత్రులకు రెండోసారి మోడీ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక గవర్నర్లకు అంతే. అందుకే ఈసారి కూడా అదే ఫార్ములా అవలంభిస్తాడని.. మరోసారి రాంనాథ్ కోవింద్ కు రాష్ట్రపతి అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. దీంతో తదుపరి రాష్ట్రపతిగా మోడీ ఎవరిని ఎంచుకుంటాడన్నది హాట్ టాపిక్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి 48.9 శాతం ఓట్లు ఉన్నాయి. ఇతర విపక్షాలకు 51.1 శాతం ఓట్లు ఉ్నాయి. దీంతో ప్రతిపక్షాలు కనుక గట్టిగా తలుచుకుంటే.. బీజేపీ సరైన అభ్యర్థిని నిలపకపోతే ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికను గెలవచ్చు. కానీ ప్రతిపక్షంలోని బిజేడీ, వైసీపీ పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయి. వాటి సాయంతో గెలవవచ్చని బీజేపీ ధీమాగా ఉంది.
ప్రస్తుతం బీజేపీకి ఒంటరిగా అయితే ప్రతిపక్షాల కంటే 2.2 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపకుంటే బీజేపీ కొంప మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే రాష్ట్రపతిగా ప్రస్తుత రాష్ట్రపతి, దళిత సామాజికవర్గానికి చెందిన రాంనాథ్ కోవింద్ తోపాటు ఈసారి గిరిజన, ముస్లిం మైనార్టీకి చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని మోడీ యోచిస్తున్నారు. ఎవ్వరూ వ్యతిరేకించని అభ్యర్థిని ఎంపిక చేయాలని చూస్తున్నారు.
2017లో బీజేపీ గెలుపులో మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆరాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది.దీంతో మిత్రుల అవసరం బీజేపీకి ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఈసారి అందరికీ అనువైన.. ఓట్లు పడేలా గిరిజన కోటాలో మహిళా అభ్యర్థి అయిన చత్తీస్ గడ్ గవర్నర్ అనుసూయా ఉకేను, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి రేసులో నిలపాలని మోడీ యోచిస్తున్నట్టు తెలిసింది.
ఇక వీరిద్దరూ కాకుంటే కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. బీజేపీ ముస్లిం నేతగా ఈయన పేరుగాంచారు. ఇటీవల రాజ్యసభ పోటీలో కూడా ఈయనను దింపలేదు. దీంతో ఇతడి పేరు కూడా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్తి రేసులో వినిపిస్తోంది. మైనార్టీ విభాగంలో బీజేపీ ఆలోచిస్తోంది. ఈయనను రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిని చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక ప్రస్తుత ఉపరాష్ట్రపతి, మన తెలుగు వారు వెంకయ్యనాయుడు రిటైర్ మెంట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు మరోసారి చాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.