కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు సంవత్సరాలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. ఆందోళన భాగంలో బంద్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన బంద్ కు దేశంలోని పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాలు కూడా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బంద్ కార్యక్రమంలో పాలు పంచుకున్నాయి. అయితే ఈసారి నిర్వహించిన బంద్లో ఏపీ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు తెలివిగా మద్దతునిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో వైరం లేకుండా.. రైతుల నుంచి వ్యతిరేకం కాకుండా తమ పార్టీ పటిష్టతను కాపాడుకుంటున్నాయంటున్నారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించిన బంద్ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. తెలంగాణ నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం బంద్ లో పాల్గొంది. అయితే టీఆర్ఎస్ మొదటి నుంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగానే ఉంటూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇవ్వలేదు. ఇవి రైతులకు నష్టం చేస్తున్నాయని చెప్పింది. అంతేకాకుండా రైతులు నిర్వహిస్తున్న బంద్ కు మద్దతు తెలుపుతోంది. అయితే టీఆర్ఎస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. మొదటి నుంచి చట్టాలకు వ్యతిరేకంగా ఒకే స్టాండ్ పై ఉంది.
ఏపీ రాష్ట్రంలో మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయంటున్నారు. సోమవారం నిర్వహించిన బంద్ కార్యక్రమానికి అధికార వైసీపీ మద్దతు ప్రకటించింది. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను బంద్ చేయించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మధ్యాహ్నం ఒంటిగంట తరువాతే పనిచేస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అయితే వైసీపీ వ్యవసాయ చట్టాలకు మొదటి నుంచి ఒకే వైఖరి అవలంభిస్తుందా..? అంటే లేదనే చెప్పాలి.
ఎందుకంటే కేంద్ర వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు తమ పార్టీ నాయకులతో మద్దతు ఇప్పించింది. అంతేకాకుండా వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని ప్రకటించారు. ‘ గత కాంగ్రెస్ రైతులను దళారుల నుంచి కాపాడలేదు. దళారులు రైతులను తీవ్రంగా నష్టపరిచారు. రాత్రి పగలు కష్టపడుతున్న రైతులకు సరైన మద్దతు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల రైతులకు మద్దతు ధర దొరుకుతుంది. మార్కెట్ కమిటీల్లోలనే అమ్మాలన్న నిబంధన ఇబ్బందులు ఉండవు’ అని రాజ్యసభ ప్రసంగంలో విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు చట్టాలకు ఏపీ రాష్ట్రంలో ఆరు పంటలకు మద్దతు ఇచ్చిందని, మరిన్ని పంటలను ఇందులో చేర్చాలని కూడా చెప్పారు.
బిల్లుల ప్రవేశపెట్టినప్పుడు వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చిన వైసీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు కొత్త వాదన తీసకొస్తున్నారు. తాము షరతులతో కూడిన మద్దతు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా బంద్ కు పార్టీ పరంగా మద్దతు ఇవ్వలేదని అంటున్నారు. రైతుల సమస్యలకు చక్కటి పరిష్కారం దొరకాలనే ఉద్దేశంతో బంద్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. దీంతో వైసీపీ రెండు విధాలుగా వ్యవహరించిందని అంటున్నారు.
ఇక ప్రతిపక్ష టీడీపీ సైతం ఈ విషయంతో తెలివిగా వ్యవహరించిందని అంటున్నారు. వ్యవసాయ బిల్లులకు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న బంద్ లో పాల్గొన్నారు. అంతేకాకుండా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వాలని తమ నాయకులకు పిలుపునిచ్చారు. కలెక్టర్లకు వినతులు ఇచ్చినంత మాత్రాన బంద్ కు మద్దుత తెలిపినట్లు అవుతుందా..? అని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ప్రతీ విషయంపై లేఖలు రాసే చంద్రబాబు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లేఖలు రాయొచ్చుగా అని అంటున్నారు