PM Kisan Samman Yojana: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రైతుల కోసం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న కేంద్రం దేశంలోని 12 కోట్ల మంది రైతులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని కేంద్రం రెట్టింపు చేయనుందని సమాచారం.

కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే ప్రస్తుతం సంవత్సరానికి రైతులు మూడు విడతలలో 6,000 రూపాయలు పొందుతుండగా ఇకపై 12,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 12.14 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందుతుండటం గమనార్హం. కొన్నిరోజుల క్రితం బీహార్ వ్యవసాయ మంత్రి అమరేంద్ర ప్రతాప్ సింగ్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు.
యూపీలో ఎన్నికల నేపథ్యంలో కేంద్రం త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా పొందే మొత్తాన్ని పెంచితే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 2018 సంవత్సరంలో మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఈ స్కీమ్ లో రిజిష్టర్ కాని వాళ్లు పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ లో రిజిష్టర్ చేసుకోవచ్చు.
ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఫారంను ఎంచుకుని అందులో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే పీఎం కిసాన్ కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు.