Chandrababu – YS Sharmila : చంద్రబాబుతో షర్మిల ఏం మాట్లాడారంటే?

వివిధ పార్టీల నాయకుల మధ్య వ్యక్తిగత స్నేహం అవసరం అని షర్మిల అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే షర్మిల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Written By: NARESH, Updated On : January 13, 2024 3:39 pm
Follow us on

Chandrababu – YS Sharmila : ఏపీ రాజకీయాల్లో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాజకీయంగా బద్ధ విరోధులైన రెండు కుటుంబాలు ఏకతాటి పైకి వచ్చాయి. చంద్రబాబు ఇంటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలకు చంద్రబాబును ఆహ్వానించారు. నాటి గురుతులను ఈ సందర్భంగా చంద్రబాబు నెమరు వేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి తో ఉన్న స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని చంద్రబాబు గుర్తు చేయడంతో షర్మిల పులకించుకుపోయారు. చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దీనిని రాజకీయ అంశంగా చూడకుండా.. స్నేహభావంతో చూడాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో వైయస్సార్ పేరిట పార్టీని స్థాపించిన ఆమె అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. తెలంగాణలో సానుకూల ఫలితాలు రావడంతో తన తెలంగాణ వైఎస్సార్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకునేందుకు సిద్ధపడ్డారు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఏఐసీసీ ప్రత్యేక ప్రకటన విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో దశాబ్దాల వైరాన్ని మరిచి ఆమె చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సాహభరిత వాతావరణంలో తమ కలయిక జరిగిందని షర్మిల మీడియాకు వెల్లడించారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి,చంద్రబాబు మంచి స్నేహితులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో రాజశేఖరరెడ్డితో చంద్రబాబుకు స్నేహం కుదిరింది. ఇద్దరూ చాలా అన్యోన్యంగా గడిపారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ ను వీడారు. అప్పటి నుంచి ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారారు. కానీ స్నేహాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. రాజకీయంగా ఆరోగ్యకర వాతావరణంలో నడుచుకున్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, జగన్ పొలిటికల్ ఎంట్రీ తో సీన్ మారింది. తన జైలు జీవితానికి చంద్రబాబు కారణమని జగన్ అనుమానిస్తూ వచ్చారు. రాజకీయ ప్రత్యర్థుల కంటే మించి శత్రుత్వం పెంచుకున్నారు. ఇటువంటి తరుణంలో వైయస్ షర్మిల రాజకీయంగా సోదరుడు జగన్ ను విభేదించారు. తెలంగాణ రాజకీయాల్లో రాణించకపోవడంతో ఏపీ పై ఫోకస్ పెట్టారు. ఇటువంటి తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న క్రిస్మస్ వేడుకలు సందర్భంగా లోకేష్ కు షర్మిల బహుమతులు పంపారు. ఇటు లోకేష్ నుంచి కృతజ్ఞతలు అందుకున్నారు.

ఈ పరిణామాలు మరువకముందే నేరుగా చంద్రబాబు ఇంటికి షర్మిల వెళ్లారు. తన కుమారుడి వివాహ వేడుకలకు ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డితో ఎలా గడిపింది చంద్రబాబు చెప్పినట్లు వివరించారు. రాజశేఖర్ రెడ్డితో తనకు ఎంతో స్నేహం ఉందని చంద్రబాబు చెప్పారని షర్మిల వెల్లడించారు. ఇద్దరూ కలిసి ఒకే జీపులో ప్రయాణించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. చంద్రబాబును పెళ్లికి పిలవడాన్ని రాజకీయ కోణంలో చూడద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. గతంలో తమ పెళ్లిళ్ల విషయంలో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ లావాదేవీలు ఉండవని.
.. తమ మధ్య కుటుంబ స్నేహం మాత్రమే ఉందన్న విషయాన్ని షర్మిల ప్రస్తావించారు. వివిధ పార్టీల నాయకుల మధ్య వ్యక్తిగత స్నేహం అవసరం అని షర్మిల అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే షర్మిల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.