
కరోనా ప్రపంచంపై విరుచుకుపడుతూనే ఉంది. తన ప్రభావం ఇంకా తగ్గలేదని నిరూపిస్తోంది. రెండు దశల్లో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కరోనా వైరస్ రెండో దశలో ప్రాణాలు సైతం ఎక్కువగానే తీసుకుంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. కరోనా అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన కలుగుతోంది. నవంబర్ లో థర్డ్ వేవ్ తన ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ఈసమయంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ల గురించి ఆందోళన కలుగుతోంది. ఈ క్రమంలో కరోనాతో మరణించిన ఓ 90 ఏళ్ల మహిళ ఒకే సమయంలో కరోనా వైరస్ ఆల్ఫా మరియు బీటా వేరియంట్లు కలిగి ఉండడం ఆశ్చర్యకరంగా మారింది. అసలు కరోనా రెండు వేరియంట్లు ఉండడానికి కారణం ఏమిటి? కరోనా శరీరంలోకి ప్రవేశించాక రెండు వేరియంట్లుగా మారిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదు రోజుల్లోనే చనిపోయేంత పరిస్థితి రెండు వేరియంట్లు తీసుకొచ్చాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
బెల్జియంలో పరిశోధకులు చివరకు అసలైన విషయాన్ని కనుగొన్నారు. ఒంటరిగా నివసించే వృద్ధురాలు చనిపోయిన తరువాత కూడా పరీక్షలు చేశారు. బ్రిటన్ లో ఉద్భవించిన ఆల్ఫా జాతి మరియు బీటా వేరియంట్ రెండింటిని ఆమె శరీరంలో కనుగొన్నారు. అయితే రెండు వేరియంట్లు కూడా బయట నుంచే ఆమెకు సోకినట్లు గుర్తించారు.
ఒకేసారి ఒకే వ్యక్తి నుంచి కాకుండా ఇద్దరు వ్యక్తుల నుంచి కరోనా సోకడంతో రెండు వేరియంట్లు ఆమె శరీరంలోకి ప్రవేశించాయి. రెండు వేరియంట్లు తట్టుకోలేక ఆమె ప్రాణాలు విడిచినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. ఆమె ఆక్సిజన్ స్థాయిలు మొదట్లో బాగానే ఉన్నా ఆరోగ్యంగా ఉన్న ఆమె పరిస్థితి వేగంగా క్షీణించింది. దీంతో ఐదు రోజుల్లోనే చనిపోయినట్లు చెబుతున్నారు. అయితే ఆమె వ్యాక్సిన్ చేయించుకోలేదని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ అధ్యయనం కూడా కరెక్టు కాదని స్పష్టం చేస్తున్నారు.