Telangana Politics: యువత తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్ అనే సినిమా డైలాగ్ మీకు గుర్తుంది కదా.. ఇది డైలాగ్ మాత్రమే కాదండోయ్ నిజంగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సమాజ గతిని మార్చాలంటే కండలు తిరిగిన బుద్ధిమంతులైన యువతతోనే సాధ్యం. అది రాజకీయాలు అయినా మరింకేదైనా సరే. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఏ పార్టీ వైపు యువత ఉంటే ఆ పార్టీ గెలుపు సాధ్యమవుతుందని గతంలో జరిగిన చాలా ఎన్నికలు నిరూపించాయి.

అంతెందుకు వామపక్ష భావజాలం ఉన్న దుబ్బాకలో బీజేపీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం యువతే. రఘునందన్ రావు వెంట యువత ఉంది కాబట్టే ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు వేసినా చివరకు ఫలితం తారుమారైంది. పలానా వ్యక్తికి ఓటేయాలని బలంగా ప్రచారం చేసేది కేవలం యువత మాత్రమే. పనిగట్టుకుని ప్రచారం చేయాలంటే పెద్ద వారితో కాదు.. అలాగని చిన్న వారు కూడా చేయరు. ఏ పార్టీ మీటింగ్ లేదా నిరసన కార్యక్రమం సక్సెస్ కావాలన్నా.. గొంతు చించుకుని అరవాలన్నా యువతతోనే అవుతుంది.
Also Read: Power cuts in AP: ముందు చూపు లేక ఏపీని ‘అంధకారం’లోకి నెట్టారా?
వారికేమైనా డబ్బులు ఇస్తున్నామా లేదా అన్నది వారు పెద్దగా పట్టించుకోరు. రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఎంతైనా ఉడుకు రక్తం కదా. అందుకే వారిని తమవైపు తిప్పుకోవాలని మొదటి నుంచి టీఆర్ ఎస్, బీజేపీ పోటా పోటీగా పావులు కదిపాయి. ఈ పోటీలోకి కాంగ్రెస్ రేవంత్ చీఫ్ అయ్యాక ఎంట్రీ ఇచ్చింది. ఉద్యమం సమయంలో టీఆర్ ఎస్ వెంట ఉన్న యువత.. 2014 ఎన్నికల సమయంలో కూడా టీఆర్ ఎస్ వెంటే నడిచింది.
కానీ నియామకాలు పెద్దగా చేపట్టకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది. దీంతో 2019లో ఎంపీ ఎన్నికలు వచ్చే సరికి బీజేపీ యూత్‌ను టార్గెట్ చేసింది. హిందూ సెంటిమెంట్ తో పాటు కొన్ని నినాదాలు ఇచ్చి నిరాశలో ఉన్న యూత్‌ను తమవైపు తిప్పకోవడంలో కొంత సక్సెస్ అయిపోయింది. ఆ ఎఫెక్ట్ ఎంపీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

బీజేపీ మొదటి నుంచి రెచ్చగొట్టే విధానాన్నే నమ్ముకుంది. అదే ఇక్కడ పనిచేసి పోటీలోనే లేని బీజేపీకి ఏకంగా 4 ఎంపీ సీట్లు వచ్చేలా చేసింది. ఇక పార్టీ పరంగా కాకుండా.. వ్యక్తి గతంగా రేవంత్ రెడ్డికి యూత్ లో మంచి గుర్తింపు ఉంది. అదే ఆయన పెట్టుబడిగా ముందుకు వెళ్లారు. ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోవాలనే ఆయన విధానాలు, పవర్ ఫుల్ స్పీచ్‌లు యూత్‌ను ఆకట్టుకున్నాయి.
కొన్ని పవర్ ఫుల్ డైలాగులు చెబితే యూత్‌లో క్రేజ్ ఏర్పడటం ఖాయం. అదే రేవంత్‌కు ప్లస్ అయింది. కానీ ఎటొచ్చి భావితరం సీఎం అవుతాడనుకున్న కేటీఆర్‌కు మాత్రమే యూత్‌లో అంతగా క్రేజ్‌రాలేదు. కొన్ని వర్గాల్లో మాత్రమే ఆయన మీద ప్రేమ ఉంది తప్ప.. అన్ని వర్గాల్లోని యూత్‌లో లేదు. ఈ విషయం రాను రాను స్పష్టంగా కనిపించింది.
జీహెచ్ ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే దీనికి మార్గం ఏంటని ఇన్ని రోజులు ఆలోచించింది. అటు రాజకీయంగా ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ టీఆర్ ఎస్‌కు సపోర్టుగా వచ్చారో అప్పుడే ఆయన యూత్ మీద దృష్టి పెట్టారు.
జాబ్ నోటిఫికేషన్లు రాకనే యూత్ తీవ్ర నిరాశలో ఉన్నట్టు ఆయన సర్వేలో వెల్లడైంది. కాబట్టి వారి అసంతృప్తిని చల్లార్చాలంటే హామీలు సరిపోవని.. కచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ వేస్తేనే వారిని ప్రతిపక్షాల చెంత నుంచి తప్పించొచ్చని చెప్పారు. దాంతో మళ్లీ వారిని తనదారిలోకి తెచ్చుకోవడానికి ఇష్టం లేకపోయినా నోటిఫికేషన్ల నినాదం ఎత్తుకున్నారు కేసీఆర్.
ఒక రకంగా చెప్పాలంటే ఇది బీజేపీకి, కాంగ్రెస్‌కు మైనస్ పాయింట్. ఎందుకంటే ఇన్ని రోజులు వారి బలమే యూత్. జాబుల పేరుతో ఇన్ని రోజులు వారు చేసిన నిరసనలు అన్నీ కొట్టుకుపోతున్నాయి. యూత్ వారి చేయిజారిపోతున్నారు. నోటిఫికేషన్లు పడుతుండటంతో అందరూ ప్రిపరేషన్‌లో మునిగిపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా జాబ్ నోటిఫికేషన్ల మీదే దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఎవరికైనా కావాల్సింది తమ కెరీర్.
అందుకే పాలిటిక్స్‌కు బ్రేక్ ఇచ్చి ప్రిపరేషన్ మీద పడ్డారు. యూత్‌ను చూసుకుని పాదయాత్రలు, నిరసన దీక్షలు ప్రకటించిన బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇప్పుడు డైలమాలో పడిపోయారు. ఎందుకంటే అంతకుముందులా యూత్ వచ్చే పరిస్థితులు లేవు. అందుకే మరో కొత్త నినాదాలను ఎత్తుకుంటున్నారు. కేసీఆర్ చెబుతాడు తప్ప చేయడు అని యూత్‌లో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు.
మరి కేసీఆర్ చేసిన పని వల్ల ఆయనకు ఏమైనా ప్రత్యేకంగా యూత్‌లో పట్టు వస్తుందా అంటే అదీ లేదు. ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్లు ఏ ప్రభుత్వం ఉన్నా వేయాల్సిందే కదా. అందుకే వారు దాన్ని కేసీఆర్ ఇచ్చారని భావించట్లేదు. తమకు రావాల్సిన హక్కుగానే భావిస్తున్నారు. యూత్‌ను ఆకట్టుకోవాలంటే కేవలం గవర్నమెంట్ నోటిఫికేషన్లు సరిపోవు.. వారికి చేయాల్సింది చేస్తే.. వారే నెత్తిన పెట్టుకుంటారు. ఎంత సేపు రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా వారికి కడుపు నింపవు కదా. అందుకే వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే వారితోనే వారు నిలుస్తారన్న విషయం ఇప్పుడున్న పార్టీలు గుర్తుంచుకోవాలి.
Also Read:Summer Special Trains: వేసవిలో తిరుపతికి స్పెషల్ రైళ్లు.. వివరాలు..