Power cuts in AP: ఆకలేస్తే ఆకాశం వైపు.. దాహం వేస్తే నేలవైపు చూసిన రోజులు రాయలసీమలో గతంలో ఉన్నాయి. నాటి దుర్భిక్ష పరిస్థితులకు ఈ నానుడిని వాడేవారు. ఇప్పుడు అలాంటి కరెంట్ సంక్షోభం ఏపీని పట్టిపీడిస్తోంది. ఏపీలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి..కాదెప్పుడు కరెంట్ కోతలను అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ ను తీసేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ సేమ్ సీన్. విశాఖపట్నం, విజయవాడ , తిరుపతి వంటి ప్రధాన నగరాల్లోనూ ఎమర్జెన్సీ లోడ్ రిలీజ్ పేరిట కోతలు విధిస్తున్నారు. కోనసీమ మొత్తం రాత్రివేళ అధికారంలోకి వెళ్లిపోతోంది. కరెంట్ పోతే దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల వరకూ రావడం లేదు. కొన్ని గ్రామాల్లో పగలంతా తీసేస్తున్న పరిస్థితి నెలకొంది. రాత్రిళ్లు చిమ్మిచీకట్లు కమ్ముకుంటున్నారు. అసలే ఎండాకాలం.. పైగా విద్యార్థులకు ‘పరీక్షా’ కాలం.. బయట అడుగుపెట్టాలంటేనే భయపడేలా ఎండలు దంచికొడుతున్నాయి. అలాగని ఇంట్లో ఉందామంటే కరెంట్ కోతలతో ఒకటే ఉక్కపోత.. బయట దోమల మోత వెరిసి.. కాళరాత్రుల్లో జాగారం చేస్తున్నారు ఏపీ ప్రజలు.

-అర్ధరాత్రి కరెంట్ కోతలతో నరకం.. ఆస్పత్రుల్లో మొబైల్ వెలుతురులో ఆపరేషన్లు
ఏపీలో కరెంట్ కోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పసిబిడ్డలు, పెద్దవాళ్ల అవస్థలు చెప్పనలవిగా ఉన్నాయి. నర్సీపట్నంలో మొబైల్ లైట్ల వెలుగులో మహిళకు డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జనాలు కరెంట్ కోతలపై రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడంతో జనాలు అల్లాడిపోయారు. జనరేటర్ వేయమని అడిగితే డీజిల్ లేదని సిబ్బంది మిన్నకుండిపోయారు. దీంతో రోగులు నరకం అనుభవించారు. విద్యుత్ కోతలతో రాత్రంతా జాగారం చేస్తున్నామని జనాల ఆవేదన.. మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాత్రిపూట పల్లెల్లో వీధులు నిశీధులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని గ్రామాల్లో దశలవారీగా రోజుకు 14 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫిర్యాదు కేంద్రాలకు ఫోన్ చేస్తున్నవారు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే.. వచ్చే నెలలో మే లో అసలు కరెంట్ ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు నెలకొంటున్నాయి.
నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తాజాగా నిండు గర్భిణి వచ్చింది. డెలివరీకి రెడీ చేయగా కరెంట్ పోయింది. దీంతో స్టాఫ్ నర్సులు.. మొబైల్ ఫోన్ లైట్లు, కొవ్వొత్తులు, చార్జింగ్ లైట్లు తెమ్మని బంధువులకు చెప్పారు. ఊరు కానీ ఊరులో వాళ్లు ఏం చేయాలో పాలుపోక పలువురి మొబైల్ పోన్లు అడిగి ఆ వెలుతురులో డెలివరీ చేసిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రి ప్రసూతి విభాగంలో చంటిబిడ్డ తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు కరెంట్ లేక దోమలతో.. ఉక్కపోతలతో నరకం అనుభవిస్తున్నారు.
-రోడ్డెక్కిన జనం..
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనాలు రోడ్లపైకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ తీశారు. ఇళ్లలో చంటిపిల్లలు, వృద్ధులతో అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ లేకపోవడంపై చంటిపిల్లలతో తల్లులు నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఇదే సీన్. జనాలు కరెంట్ కోతలపై సోషల్ మీడియాలో.. బయట ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.
-జనం అవస్థలు అన్నీ ఇన్నీ కావు..
పరీక్షలకు సమయం దగ్గరపడడం.. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో వాళ్ల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. పగలు చదువుకుంటున్నా.. రాత్రిళ్లు సరైన నిద్రలేక విద్యార్థులు జాగారం చేస్తున్నారు. కరెంట్ పోవడంతో జనాలు వరుసగా విద్యుత్ కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులపై బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు. తమ బాధలు పట్టవా? అంటూ తిట్టిపోస్తున్నారు. పగటిపూట విద్యుత్ కోతలు ఉన్నా పర్లేదని.. రాత్రిళ్లు మాత్రం లేకుండా చూడాలని జనాలు కోరుతున్నారు.
-పంటలు ఎండి.. పరిశ్రమలన్నీ మూతబడి..
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చివరి దశకు వచ్చిన కొన్ని పంటలకు నీరందక వదిలేస్తున్న పరిస్థితులున్నాయి. ఇక పరిశ్రమలకు రెండు వారాల పాటు పవర్ హాలీడే ఇచ్చేశారు. దీంతో ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 253 పరిశ్రమలకు కేవలం 50శాతం మాత్రమే విద్యుత్ వాడుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. వారంలో రెండు రోజులు 1696 పవర్ హాలీడే ప్రకటించారు. వీక్లి హాలీడేకు అదనంగా మరో రోజు పవర్ హాలీడే ఇచ్చేశారు. దీంతో పరిశ్రమలు మూతపడ్డ పరిస్థితి నెలకొంది.
-ఆంధ్రలో డిమాండ్ 235 ఎంయూలు.. 185 ఎంయూలే అందుబాటులో..
ఏపీలో మొత్తం కరెంట్ డిమాండ్ 235 ఎంయూలు ఉంది. కానీ అందుబాటులో ఉన్న కరెంట్ 185 ఎంయూలే. ఇంకా 50-60 ఎంయూల కొరత ఏపీని వేధిస్తోంది. అందుకే ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. మిగిలిన లోటును భర్తీ చేసుకోవడానికి యూనిట్ కు రూ.4 వరకూ ఉన్న విద్యుత్ రూ.20కి పెట్టి కొంటున్నారు. అది సరిపోక కోతలు విధిస్తున్నారు. ఇది ఆర్థిక భారాన్ని మిగిలిస్తోంది. తెలంగాణలో డిమాండ్ 265 ఎంయూలు అయితే.. ఉత్పత్తి 111.58 ఎంయూలే. కానీ వాళ్లు కేంద్రం నుంచి.. ఇతర ఎక్స్చేంజీల నుంచి ముందే ఒప్పందం చేసుకొని రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేసి మరీ 24 గంటల పాటు జనాలకు కరెంట్ ఇస్తున్నారు. ఏపీ మాత్రం ఉన్న చంద్రబాబు హయాంలోని ఒప్పందాలు రద్దు చేసుకొని ఇప్పుడు కొందామన్నా కరెంట్ లేక ప్రజలకు కోతలు విధిస్తోంది. నిజానికి ఏపీ విద్యుత్ ఉత్పత్తి సామర్థం దక్షిణాలోని తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. 180 ఎంయూల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మిగిలిన 50 ఎంయూల కొరతను తీర్చలేక కోతలు విధిస్తోంది. దీనికి జగన్ పరిపాలన వైఫల్యం ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
-దక్షిణాది ఐదు రాష్టాల్లో కోతలు లేవు
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళతోపాటు చిన్న రాష్ట్రం పుదుచ్చేరిలోనూ కరెంట్ కోతలు లేవు. గత వారం రోజులుగా విద్యుత్ కొరత ఏపీలోనే ఎక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ముందస్తుగా పరిస్థితిని అంచనావేసి అవసరమైన విద్యుత్ ను సమకూర్చుకున్నాయి. మన ఏపీ విద్యుత్ సంస్థలు మాత్రం ప్రజలను చీకట్లకు వదిలేశాయి.
-విద్యుత్ ఫెయిల్ కు జగన్ సర్కారే కారణమా?
ఏపీలో ప్రస్తుతం 50 ఎంయూల లోటు ఉంది. కరెంట్ కోతలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో లేని కోతలు అత్యధిక ఉత్పత్తి సామర్థ్యమున్న ఏపీలోనే ఎందుకు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. కావాల్సిన వనరులు దక్షిణాది రాష్ట్రాల కంటే ఎక్కువే ఏపీకి ఉన్నాయి. కానీ ముందస్తు ప్రణాళిక లేకుండా జగన్ వ్యవహరించడే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. విద్యుత్ రంగంలో జగన్ తీసుకున్న నిర్ణయాలేనన్న చర్చ సాగుతోంది. విద్యుత్ కొరతతో ఏపీలో జనాలు హాహాకారాలు చేస్తున్నా ఇంతవరకూ దీనిపై జగన్ సమీక్షించింది లేదు. సమస్యను పరిష్కరించింది లేదు. ప్రజలకు ఇబ్ందులు కలుగుకుండా ప్రత్యామ్మాయ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సీఎం జగన్ యే పట్టించుకోకపోవడంతో ఇక అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోలేక మిన్నండిపోతున్నారు. జనాలకు కరెంట్ కోతలు విధిస్తూ సరిపెట్టుకుంటున్నారు.
ఈనెలాఖరు వరకూ పరిశ్రమలకు పవర్ హాలీడేలు..జనాలకు కోతలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఏపీ ప్రజలు , పారిశ్రామిక రంగం తీవ్రంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఇప్పటికైనా ఏపీని ఈ ‘అంధకారం’ నుంచి బయటకు తీసుకురావాలని.. విద్యుత్ కొరత తీర్చాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
[…] Also Read: Power cuts in AP: ముందు చూపు లేక ఏపీని ‘అంధకారం’… […]