Rahul Jodo Yatra In Telangana: రాహుల్ గాంధీ.. తిరిగి అధికారమే లక్ష్యంగా భారత్ జోడో అనే యాత్రకు శ్రీకారం చుట్టారు. నాలుగు రాష్ట్రాల్లో ఈ యాత్ర పూర్తయింది. ఇవాళ కృష్ణ బ్రిడ్జి మీదుగా నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని రాయచూరు వెళ్లి రాహుల్ గాంధీని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. ఇక రాహుల్ గాంధీ జోడో యాత్ర కర్ణాటకలోని రాయచూరు నుంచి కృష్ణ నది బ్రిడ్జి మీద ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ కేవలం ఐదు కిలోమీటర్ల మేరకే యాత్ర సాగుతుంది. కృష్ణా నది బ్రిడ్జి నుంచి అక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ మీదుగా గుడేబల్లూరు వరకు యాత్ర కొనసాగింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు గుడేబల్లురుకు వరకు చేరుకున్న రాహుల్ గాంధీ తన యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చారు. దీపావళి పండుగ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున బాధిత స్వీకార నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆది వారం ఢిల్లీకి వెళ్లి మళ్లీ 27న తిరిగి ఆయన యాత్ర చేపడతారు. ఆరోజున మక్తల్ లోని కెవి సబ్ స్టేషన్ నుంచి ఆయన యాత్ర ప్రారంభం అవుతుంది. తెలంగాణలో మొత్తం 12 రోజులపాటు ( నవంబర్ 4వ తేదీన సాధారణ విరామం) పాదయాత్ర సాగుతుంది. రోజు 25 కిలోమీటర్ల మేరకు రాహుల్ గాంధీ నడక సాగుతుంది. ఏడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. ప్రతిరోజు పాదయాత్ర అనంతరం కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఈ యాత్రలో భాగంగా వివిధ రంగాల్లో మేధావులు, సామాజికవేత్తలు, వివిధ సంఘాల నేతలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులను ఆయన కలుస్తారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మసీదులు, చారిత్రాత్మక ప్రదేశాలను ఆయన సందర్శిస్తారు.

-విభజన హామీలపై స్పష్టత
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మోడీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం కనుగొనలేదని ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. పైగా విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ క్రమంలో 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని తిరిగి చేక్కించుకోవాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ప్రారంభమైన జోడోయాత్రలో ఆయన ప్రముఖంగా విభజన సమస్యలను ప్రస్తావించారు. నాడు అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. ముఖ్యంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. వంటి అంశాలను ఆయన వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చారు. ఈ సమయంలో స్థానిక ప్రజలు ఈలలు వేస్తూ ఆయనను ఉత్తేజపరిచారు. మిగులు బడ్జెట్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు రేసులో వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ.. యాత్ర ద్వారా ఉత్తేజం పొందుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
-ఇది ఒక మహా ఉద్యమం
రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర.. మహా ఉద్యమం అని రేవంత్ రెడ్డి అభి వర్ణించారు. మాణిక్యం ఠాగూర్, షబ్బీర్ అలీ, మల్లు రవి, మధుసూదన్ రెడ్డి తో కలిసి ఆయన భారీగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో చేపడుతున్న కార్యక్రమాలను రాహుల్ గాంధీకి వివరించారు. దేశ సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా ఇందిర, రాజీవ్ ప్రాణ త్యాగాలు చేశారని కొనియాడారు.