Chandrababu: చంద్రబాబుపై రాజకీయాల్లో ఎన్నో అపవాదులు ఉన్నా.. ఆయన మాత్రం రాజకీయ చాణుక్యుడు..పట్టువదలని విక్రమార్కుడు. అనుకున్నది సాధించే వరకూ నిద్రపోడు. అది మంచైనా..చెడైనా.. తన రాజకీయ ప్రయాణంలో అటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడ్డాడు. అయితే ఈ క్రమంలో తడబడినా ప్రతీసారి నిలబడ్డాడు. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న తనను,, తన పార్టీని గట్టెక్కించేది పవన్ కళ్యాణేనని గట్టిగా నమ్ముతున్నారు.అందుకే పవన్ ప్రాపకం కోసం చేయని ప్రయత్నం లేదు. జనసేనతో పొత్తు కోసం గత మూడున్నరేళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఉన్న ప్లస్ పాయింట్ సిట్యువేషన్ కు తగ్గట్టు స్పాంటనిష్ గా స్పందించే గుణం. సమస్యలు వచ్చిన ప్రతీసారి వాటిని ఎలా పరిష్కరించుకొని ముందుకెళ్లాలో ఆయనకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. 1995లో టీడీపీ సంక్షోభం, ఎన్టీఆర్ ను గద్దెదించడం, నందమూరి వారసుల సహకారం, అటు పార్టీ హస్తగతం, ప్రభుత్వం ఏర్పాటు అన్ని ఒక పద్ధతి ప్రకారం చేసి సక్సెస్ అయ్యారు. 2004 ఓటమి తరువాత ఇక పార్టీ పనైపోయిందని అందరూ భావించారు. కానీ 2014 రాష్ట్ర విభజన సిట్యువేషన్ లో సీనియార్టీ అన్న అంశాన్ని తెరపైకి తెచ్చి అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా పదవి అందుకున్నారు.

అయితే 2019 ఘోర ఓటమి తరువాత మాత్రం చంద్రబాబు, అటు టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలోని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం జగన్ సర్కారుకు అన్నివిధాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే అదంతా చంద్రబాబుపై కోపం మీద అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే కేంద్ర పెద్దల వ్యవహార శైలిని గమనిస్తూ వచ్చిన చంద్రబాబు వారికి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. గత మూడున్నరేళ్లుగా ప్రయత్నిస్తునే ఉన్నారు. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవన్న విషయం మోదీ, షా ద్వయానికి తెలియనివి కావు. అందుకే చంద్రబాబును ఒక ఆప్షన్ గా ఉంచుకున్నారు. కాస్తా దగ్గరికి చేర్చుకున్నట్టు సంకేతాలిచ్చారు. అయితే ఈ అవకాశాన్ని చూసి అల్లుకుపోయిన చంద్రబాబు తన నటనా కౌశల్యాన్ని, అభినయాన్ని ప్రారంభించారు. అడగకుండానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సహకరించారు. తనకు బలం లేకున్నా కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్నారు.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సుదీర్ఘ విరామం తరువాత ప్రధాని మోదీని చంద్రబాబు కలుసుకున్నారు. అప్పటి నుంచి తన స్టైల్ ను మార్చారు. నిత్యం బీజేపీ నామాన్ని జపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంపై ప్రశంసల జల్లు కురిపించిన సందర్భాలున్నాయి. చంద్రబాబు చేస్తున్నది కాస్తా అతిగా కనిపించినా ఆయనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ కూడా అదే పనిచేశారు. అయితే విధేయత చాలదనుకున్నారో ఏమో కానీ.. చంద్రబాబు నేరుగా అమిత్ షాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా చంద్రబాబు కంటే జూనియర్. అయినా సరే ఈ వెంపర్లాట ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. ఇక మున్ముందు చంద్రబాబు నుంచి ఇటువంటివి ఎన్నో చూడాల్సి ఉంది మరీ.