Adilabad: ఆదిలాబాద్ అడవుల్లో వరుసగా పులుల మృతి.. అసలేమైంది? కారణమేంటి?

పులులు చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు విషప్రయోగం అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అది ఇప్పుడు నిజమవుతున్నదని.. పరిస్థితులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 10, 2024 11:15 am

Adilabad

Follow us on

Adilabad: దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో ఇటీవల రెండు పులులు మృతి చెందడం కలకలం రేపింది. ఆ రెండు పులుల్లో ఓ ఆడ పులి, మగ పులి ఉండటం విశేషం. అయితే అవి మహారాష్ట్ర నుంచి సంతానోత్పత్తి కోసం వచ్చాయని, ఆధిపత్య పోరు వల్లే మగ పులులు వాటిని చంపేసి ఉంటాయని అటవీశాఖ అధికారులు మొన్నటి వరకు అనుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వారు దర్యాప్తు చేస్తుంటే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగజ్ నగర్ ప్రాంతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడంతో.. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది అనే ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. కాగజ్ నగర్ పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న దరిగాం అటవీ ప్రాంతంలో బురద మామిడి పరిసరాల్లో గత శనివారం రెండు సంవత్సరాల వయసు ఉన్న ఒక ఆడ పులి, ఆరు సంవత్సరాల వయసు ఉన్న ఓ మగ పులి సోమవారం మృతి చెందాయి. పులుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా రెండు పులులు అత్యంత అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం అటవీ శాఖ అధికారులను కలకలానికి గురి చేసింది. ఆధిపత్య పోరు వల్లే అవి చనిపోయి ఉంటాయని అధికారులు ఇప్పటివరకు ఓ నిర్ధారణకు వచ్చారు. కానీ వారి లోతు దర్యాప్తులో వెలుగు చూస్తున్న విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.

పులులు చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు విషప్రయోగం అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అది ఇప్పుడు నిజమవుతున్నదని.. పరిస్థితులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయని వారు అంటున్నారు. పులులు ఎలా చనిపోయాయి అనే కోణంలో అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించారు. మగ పులి కళేబరం సమీపంలోనే ఒక చిద్రమైన స్థితిలో ఆవు కళేబరం పడి ఉంది. అయితే అధికారులు ఆవును చంపి, దాని మాంసాన్ని తిన్న తర్వాత పులి చనిపోయి ఉంటుందని మొదట్లో ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆవు కళేబరాన్ని కొంతమంది పథకం ప్రకారం విషపూరితం చేసి ఉంటారని, ఆ మాంసం తినడం వల్లే పులి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు మగ పులి మెడకు ఉచ్చు ఉండడాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఎన్టీసీఏ సభ్యుల సమక్షంలో పులులు, ఆవుకు సంబంధించిన అవయవ భాగాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇక శనివారం మృతి చెందిన ఆడ పులిని ఆధిపత్య పోరులో వేరే మగపులి చంపి ఉంటుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. కాగా పోస్టుమార్టం అనంతరం పులుల కళేబరాలను అటవీ శాఖ అధికారులు దహనం చేశారు. అయితే కాగజ్ నగర్ తనానికి సమీపంలో ఉన్న దరిగాం అటవీ ప్రాంతంలోని బురద మామిడి పరిసర ప్రాంతాల్లో మూడు కూనల తో పాటు ఒక పెద్ద ఆడపులి సంచరిస్తున్నట్టు సమాచారం. గతంలో పులుల ఆనవాళ్ళను అటవీశాఖ అధికారులు గుర్తించారు కూడా. అయితే ఈ ఆడ పులి కుటుంబం తరచూ జనావాసాలకు వచ్చి వెళుతూ ఉండడం, గతంలో కాగజ్ నగర్ పరిసర ప్రాంతాలకు రావడం సంచలనాన్ని సృష్టించింది. ఇక ఈ సమూహంలోని ఏదో ఒక పులి పశువులపై వరుసగా దాడులు చేసి చంపేస్తుండడంతో.. పరిసర గ్రామాల రైతులు అటవీ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అటవీ సిబ్బంది పశువుల సంచాలని ఈ క్రమంలో అటవీ సిబ్బంది పశువుల సంచారాన్ని నిరోధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.. అంతేకాదు అడవుల్లోకి మేతకు వెళ్లడానికి కూడా కట్టడి చేశారు. దీంతో పశువులకు గ్రాసం లభించక పాల ఉత్పత్తి తగ్గిపోయింది. పశువులు కూడా బక్కచిక్కడం ప్రారంభమైంది. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పెద్ద పులులు లేకుంటే తమకు ముప్పు ఉండదని భావించారు. అందులో భాగంగానే ఒక ఆవు కళేబరానికి విషాన్ని పూసి.. పులికి ఎరగా వేశారని.. దాన్ని తిన్న పులి చనిపోయిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు..

ఇక కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని కడంబా అటవీ ప్రాంతంలో కూడా పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 8 సంవత్సరాలుగా పులుల సంచారం ఎక్కువైంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని తడోబా నుంచి ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ఉన్న కడంబ అడవుల్లోకి పులులు సంచరిస్తున్నాయి. వాటి రాకపోకలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో వాటి కదలికలను నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు నామ మాత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూరు, సిర్పూర్ రేంజ్ పరిధిలోని అధికారులకు దీనిపై అవగాహన లేదని సమాచారం. మరోవైపు ఏడాదిగా యానిమల్ ట్రాకర్లకు ప్రభుత్వం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో పులుల భద్రత గాలిలో దీపమవుతున్నది. ఇదే అదునుగా స్మగ్లర్లు, ఇతరులు అడవుల్లోకి చొరబడి పులుల ప్రాణాలను తీస్తున్నారు. ఇతర వన్యప్రాణులను వేటాడుతున్నారు. అయితే గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ అడవిశాఖ అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు..

దరిగాం అడవుల్లో మృతి చెందిన పులుల అవశేషాలను అటవీశాఖ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అయితే పుల్లపై విష ప్రయోగం జరిగిందా? ఆవును తిన్న తర్వాత వాటి శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కేవలం ఒక్క పులి మాత్రమే మృతి చెందిందా? లేక ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా? అనే విషయాలు పరీక్షల తర్వాత వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు తిప్పేశ్వర్, తడోబా పులుల అభయారణ్యాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పులుల సంతతి పెరగడంతో కొన్ని పులులు కవ్వాలకు కారిడార్ హీ ఉన్న కడంబా అడవుల్లోకి రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అంతేకాదు కొన్ని పులులు ప్రాదేశిక ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పులుల మీద దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఇటువంటి సంఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.