CM Revanth Reddy furious: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మొత్తంగా అధికార కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చినా.. ఆశించిన మేరకు సీట్లు రాలేదు. వాస్తవానికి పోరు ఏకపక్షంగా ఉంటుందని హస్తం నేతలు భావించారు. కానీ, బీఆర్‌ఎస్, బీజేపీ గట్టి పోటీ ఇచ్చాయి. దీంతో 12 వేల పైచికులు పంచాయతీల్లో కాంగ్రెస్‌కు 7 వేలు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్ఠానం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.
16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం
పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్‌తో సమన్వయం చేయకపోవడం, బంధువులను అభ్యర్థులుగా దించడం వంటి లోపాలపై రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి తెలిపారు. 16 మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల పనితీరును తప్పుబట్టారు. పార్టీకి జరిగిన నష్టాలకు వారే బాధ్యులని, వెంటనే వైఖరి సరిదిద్దుకోవాలని ఆదేశించారు.
పంచాయతీల్లో కాంగ్రెస్ ఆధిక్యం
మూడు విడతల ఎన్నికల్లో 12,733 సర్పంచి స్థానాల్లో కాంగ్రెస్ 7,010 స్థానాలు సాధించి 56 శాతం ఆధిక్యం పొందింది. భారత్ రాష్ట్ర సమితి 3,502, బీజేపీ 688, ఇతరులు 1,505 స్థానాలు గెలిచాయి. అయితే, ఆధికార ప్రాంతాల్లో కొన్ని స్థానాలు కోల్పోవడంపై అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేసింది.