Revanth Reddy vs Bhatti: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటింది. నెల రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చుకున్నారు. రేవంతన్నగా తనను ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాలన సాఫీగా సాగేందుకు సమష్టిగా పనిచేస్తామని, ఇందుకు ప్రజల సహకారం కావాలని కోరారు. ఇక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా కలిసి పని చేస్తున్నట్లు కనిపించింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహాన్ని లోక్‌సభలోనూ కొనసాగించేందుకు టీకాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇలా సాఫీగా సాగిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది.
సీఎం పదవి ఆశించి..
దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని బీఆర్‌ఎస్(పాత టీఆర్‌ఎస్) అధినేత 2014లో ప్రకటించారు. కానీ ఆ ఎన్నికల తర్వాత, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాతా తానే సీఎం పీఠం అధిష్టించారు. ఈ నేపథ్యంలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు దళిత కోటాలు సీఎం పదవి వస్తుందని భట్టి విక్రమార్క ఆశించారు. ఈ క్రమంలోనే ఆయన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధిష్టానం వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. అనుకున్నట్లే కాంగ్రెస్ గెలిచింది. కానీ భట్టి ఆశ నెరవేరలేదు. సీఎం పదవి రేవంత్‌రెడ్డిని వరించింది. సీనియారిటీ, దళితుల కార్డు ఆధారంగా తనను ఎంపిక చేస్తారని భట్టి ఆశించినా ప్రజాదరణ రేవంత్‌రెడ్డికే ఉండడంతో హైకమాండ్ రేవంత్‌వైపే మొగ్గు చూపింది. భట్టిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించింది.
ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు
అందరూ సర్దుకుని.. నెల రోజుల పాలన విజయవంతంగా పూర్తిచేశారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క సతీమణి నందిని ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. భట్టి సీఎం కాకపోవడంతో ఆయనతపాటు పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ చెందాయని వెల్లడించారు. దీంతో భట్టికి సీఎం పదవిపై ఇంకా ఆశ తగ్గలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఇదే.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. అసలే కాంగ్రెస్ అంటే కయ్యాల పార్టీ. కానీ అన్నీ సర్దుకుని కొత్త ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో భట్టి విక్రమార్క భార్య కొత్త చర్చకు తెరలేపారు.
మైండ్‌గేమ్ మొదలు..
ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో అందరూ కలిసి పనిచేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా.. భట్టి సతీమణి చేసిన వ్యాఖ్యలతో విభేదాలు సమసిపోలేదని అర్థమవుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరూ మైండ్‌గేమ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. భట్టి అనుమతితోనే నందిని వ్యాఖ్యలు చేసి ఉంటారని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు భట్టి విక్రమార్క తన భార్య నందినిని ఖమ్మం నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ వేగంగా అడుగులు వేసి ఖమ్మం లోక్‌సభ బరిలో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీనే నిలపాలని భావిస్తున్నారు. ఈమేరకు పార్టీతో తీర్మానం చేయించి అధిష్టానానికి పంపించారు. అధిష్టానం కూడా దక్షిణాదిన పట్టుకోసం టీకాంగ్రెస్ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. భట్టికి చెక్ పెట్టేందుకే రేవంత్ సోనియాగాంధీని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సోనియా పోటీ చేస్తే.. ఇక దానికి కాదనే అవకాశం ఎవరికీ ఉండదు. ఈ క్రమంలోనే రేవంత్ కూడా రివర్స్ గేమ్ స్టార్ట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. మరి ఖమ్మంలో సోనియా పోటీపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ సోనియాగాంధీ పోటీ చేయని పక్షంలో మంత్రి పొంగులేటి సోదరుడు లేదా నామా నాగేశ్వరరావును బరిలో దించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.