IT Layoffs 2023: అమెజాన్ నుంచి మైక్రో సాప్ట్ దాకా ఉద్యోగాల్లో విధిస్తున్నాయి. కొత్త రిక్రూట్మెంట్లకు మంగళం పాడాయి. భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపించడం లేదు. దీనికి కోవిడ్, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం కారణాలని చెబుతున్నా.. తెలియని అసలు విషయం వేరే ఉంది.

గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి కంపెనీలు 1,54, 336 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు రెండు సంవత్సరాలలో 1,495 కంపెనీలు 2.4 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. అవి ఎందుకిలా ఉద్యోగులను తొలగిస్తున్నాయి? అంటే దాని మూలాలు ఈ కంపెనీల పెట్టుబడుల్లో ఉన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి.. 2008లో మహా మాంద్యం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మొత్తం బలహీనపడ్డాయి. వస్తు, సేవలకు డిమాండ్ బాగా తగ్గిపోయింది.. రుణాలకు డిమాండ్ తక్కువగా ఉండటంతో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు తగ్గించాయి. ఆ సమయంలో వెంచర్ క్యాపిటలిస్టులు మార్జినల్ కాస్ట్ తక్కువగా ఉండే సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పెట్టుబడులు కుమ్మరించారు ( మార్జినల్ కాస్ట్ అంటే అదనపు ఉత్పత్తికి అయ్యే వ్యయంలో పెరుగుదల) . ఒకసారి గుర్తు చేసుకుంటే… ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల యుగం ఊపు అందుకుంది కూడా ఇంచుమించుగా అప్పుడే. అప్పుడే మొట్టమొదటి ఐఫోన్ 2007 జూన్ లో మార్కెట్లోకి వచ్చింది..ఇదే క్రమంలో యాప్ ల విప్లవం మొదలైంది. ఇలా ఒకదాని వెంట మరొకటిగా విప్లవాలు రావడంతో సోషల్ మీడియా ( ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్), కన్జ్యూమర్ టెక్ ( గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటివి) కంపెనీలు అత్యంత వేగంగా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న కంపెనీలు ఎదిగాయి.
ద్రవ్యోల్బణం దెబ్బేసింది
దూసుకుపోతున్న టెక్ కంపెనీల జోరుకు కోవిడ్ అనంతరం ద్రవ్యోల్బణం దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు బ్యాంకులన్నీ వడ్డీరేట్లు పెంచాయి.. దీంతో వెంచర్ క్యాపిటలిస్టులు టెక్ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. దీనికి తోడు ప్రపంచమంతా మళ్లీ ఆర్థిక మాంద్యం దిశగా నడుస్తోందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.. దీంతో టెక్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.. ఈ కోతలపర్వం ప్రారంభమైంది..

కొన్ని సంవత్సరాలుగా కంపెనీలు కొత్త టెక్నాలజీల రూపకల్పన దిశగా కృషి చేస్తున్నాయి.. ఈ క్రమంలో అప్డేట్ కానీ ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.. ప్రస్తుత ఉద్యోగుల కోతకు అది కూడా ఒక కారణం. మహా మాద్యం తర్వాత పరుగు ప్రారంభించిన టెక్ కంపెనీల ప్రాథమిక సమస్యలన్నీ ఈ పది,పదిహేను ఏళ్లల్లో తీరిపోయాయి. ఇప్పుడు ఆ సంస్థలకు అత్యవసరంగా పరిష్కరించుకోవలసిన సమస్యలు ఏవీ లేవు. దీంతో అవన్నీ తదుపరితరం టెక్నాలజీలపై దృష్టి సారించాయి.. ఏళ్ళు గడుస్తున్నా అప్ డేట్ కాని ఉద్యోగులను వదిలించుకొని కొత్త టెక్నాలజీల దిశగా సాగిపోతున్నాయి.