KCR BRS: లోకల్ పార్టీ నుంచి నేషనల్ పార్టీగా నామకరణం చేశారు. అధికార, ప్రతిపక్షాల్ని తూర్పారబడుతున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్నారు. రాష్ట్రానికో నేతతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. కూటమి కట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంత సాహసం చేస్తున్న ఆ నేత ఎవరనుకుంటున్నారా ?. ఎవరో కాదు తెలంగాణ సీఎం కేసీఆర్. జాతీయ స్థాయిలో కేసీఆర్ వెంట వచ్చేదెవరు ?. కాంగ్రెస్ తో వెళ్లేదెవరు ? అన్న అంశం పై స్పెషల్ ఫోకస్.

కేసీఆర్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. కర్ణాటక నుంచి మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు నుంచి వీసీకే అధినేత తిరుమావలన్ అతిథులుగా వచ్చారు. కేసీఆర్ ను ఆహా, ఓహో అంటూ పొగిడారు. వెళ్లిపోయారు. తర్వాత ఖమ్మం సభ జరిగింది. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంతమాన్ లు వచ్చారు. లెప్ట్ పార్టీ నుంచి కేరళ సీఎం విజయన్, సీపీఐ నేత రాజా వచ్చారు. యూపీ నుంచి మాజీ సీఎం అఖిలేశ్ వచ్చారు. కేసీఆర్ కంటి వెలుగు భేష్ అంటూ పొగిడారు. వెళ్లారు. కుమారస్వామి, తిరుమావలన్ గైర్హాజరయ్యారు.
ఒకసారి వచ్చిన జాతీయ నేతలు మరోసారి రావడం లేదు. కేసీఆర్ మాత్రం ప్రతిపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అది కూడ కాంగ్రెస్ లేని ప్రతిపక్షాలు. కేసీఆర్ కు కాంగ్రెస్ తో కలవడం ఇష్టం లేకపోతే.. మిగిలిన ప్రతిపక్షాలు కూడ కేసీఆర్ దారిలో నడుస్తారని ఆశించడం అత్యాశే కదా. కర్ణాటకలో కుమారస్వామికి కాంగ్రెస్ తో అవగాహన ఉంది. గతంలో కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయ్యారు. ఇప్పుడు కూడ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. జేడీఎస్ తో పొత్తు పెట్టుకునే అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి ఉపయోగం లేని కేసీఆర్ తో కుమార స్వామి జట్టు కట్టడంలో ఔచిత్యం ఏముంది.
ఇక తిరుమావలన్.. డీఎంకేతో సఖ్యతగా ఉన్నారు. తమిళనాడులో తిరుమావలన్ పార్టీ బీజేపీ వ్యతిరేక రాజకీయాలు చేసినా.. కాంగ్రెస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. డీఎంకే, వీసీకే, కాంగ్రెస్ తమిళనాడులో ఒక అవగాహనతో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సొంత రాష్ట్రంలో ప్రయోజనాలు వదిలేసి తిరుమావలన్ కేసీఆర్ తో కలిసి వస్తారనే ఆశ ఒట్టిదే.

లెఫ్ట్ పార్టీలు విషయానికొస్తే.. సీపీఎం కేరళలో కాంగ్రెస్ తో ఫైట్ చేస్తుంది. కానీ మిగిలిన రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంటుంది. సీపీఐ పరిస్థితి కూడ అంతే. కేసీఆర్ సభలో పాల్గొన్న డి. రాజా.. వెంటనే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో కూడ పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిపక్షాల ఐక్యత అంటే కాంగ్రెస్ తో కూడిన ప్రతిపక్షాల ఐక్యత అని కమ్యూనిస్టుల ఉద్దేశం. బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమని కమ్యూనిస్టులు ఖమ్మం సభకు వచ్చారే తప్ప.. కేసీఆర్ పై ప్రేమతో కాదనే విషయాన్ని గుర్తించాలి. కమ్యూనిస్టులతో పొత్తు ఉన్నా అది తెలంగాణకే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏం లేదు. పొత్తు ఏదైనా అది ఎన్నికల ఫలితాల తర్వాతే ఉంటుంది. కేసీఆర్ కు తెలంగాణలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కనీసం పార్టీ కమిటీ కూడ లేదు. అలాంటప్పుడు దేశ వ్యాప్తంగా కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే కేజ్రీవాల్ కు ఉపయోగం ఉండదు. కేజ్రీవాల్ ఎక్కడా పొత్తులు పెట్టుకోవడం లేదు. ఒంటరిగానే పార్టీ విస్తరణ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ తో పొత్తుకు అవకాశం ఉండదు. యూపీ నుంచి వచ్చిన అఖిలేశ్ యాదవ్ ది అదే పరిస్థితి. వెళ్తే కాంగ్రెస్ తో లేదంటే.. ఒంటరిగా వెళ్లాలి అన్నట్టు అఖిలేశ్ వైఖరి ఉంటుంది.
కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ తో అవగాహన ఉన్న ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ తో ఎందుకు కలిసి వెళ్లాలి ? వెళ్తే ప్రయోజనం ఏంటన్న ప్రశ్న వేసుకుంటున్నాయి. అందుకే కేసీఆర్ సభలకు ఒకసారి వచ్చిన నేతలు మరోసారి రావడం లేదు. అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత అంటే అందులో అన్ని పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ కు మినహాయింపు ఉండదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాలి.