Vijayawada Airport: ఏపీ అన్నివిధాలా దగాకు గురవుతోంది. విభజన హామీల అమలు లేదు. ప్రత్యేక రైల్వే జోన్ లేదు. పోలవరానికి పురోగతి లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దేశంలో అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఇవి చాలవన్నట్టు రాష్ట్రంలో ఒక్కో జాతీయ సంస్థ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులేస్తోంది. అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం ఉదాసీనతో ఏపీ అన్నివిధాలా నష్టపోతోంది. మొన్నటికి మొన్న విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ద్వారా అమ్మకం చూపిన కేంద్రం.. ఇప్పుడు విజయవాడ ఎయిర్ పోర్టును సైతం విక్రయించేందుకు సిద్ధపడుతోంది. రాబోయే రోజుల్లో విక్రయించే ఎయిర్ పోర్టుల జాబితాలో విజయవాడ పేరు కూడా ఉంది. అంటే మరికొద్దిరోజుల్లో ఏపీకి ఉన్న అతి పెద్ద ఎయిర్ పోర్టు ప్రభుత్వ విమానయాన సంస్థ నుంచి చేజారిపోతుందన్న మాట.

దీనిపై జాతీయ మీడియా సంస్థలు రకరకాలుగా కథనాలు ప్రచురిస్తున్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అమ్మబోయే విమానాశ్రయాల జాబితాను వెల్లడించే అవకాశమున్నట్టు కథనాల సారాంశం. ఈ జాబితాలో విజయవాడ ఎయిర్ పోర్టు కూడా ఉంది. విమానయాన రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి కేంద్రం నిర్ణయించింది. అయితే ఇక్కడ పెట్టబడులను ఆశ్రయించడం అంటే కొత్త విమానాశ్రయాలు కట్టడం కాదు. ఉన్నవాటిని అమ్మేయడమే. ఈ లెక్కన విజయవాడ ఎయిర్ పోర్టును విక్రయించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 8 వేల కోట్లకు బేరం కుదిరినట్టు వినికిడి.
దేశ వ్యాప్తంగా 146 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి ఉన్నవి ఐదే విమానాశ్రయాలు. అందులో విశాఖ ఎయిర్ పోర్టు పూర్తిగా వైమానిక దళానికి సంబంధించింది. మిగతా ఎయిర్ పోర్టుల సామర్థ్యం అంతమాత్రమే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అతి పెద్దదిగా ఉన్న విజయవాడ ఎయిర్ పోర్టును విక్రయించాలని చూడడం రాష్ట్రానికి శాపమే. వాస్తవానికి ఇప్పుడున్న 146 ఎయిర్ పోర్టులను 200 కు పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కానీ అందుకు తగ్గట్టుగా ప్రైవేటు పెట్టుబడులు రావడం లేదు. వాటిని ఆకర్షించేందుకు దేశంలో 11 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరణ మాటున విక్రయించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అందులో ఏపీని పరిగణలోకి తీసుకోవడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

ఒక వైపు వైసీపీ సర్కారు జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు కడతామని ప్రకటించింది. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటువంటి సమయంలో ఉన్న ఎయిర్ పోర్టును విక్రయించేందుకు సిద్ధపడినా నోరు మెదపడం లేదు. మొన్న ఆ మధ్య ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకే వచ్చారని అధికార వైసీపీ నేతలు ఊరూవాడ ప్రచారం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి వంటి నేతలైతే తన సోషల్ మీడియా ఖాతాలకు తెగ పనిచెప్పారు. ఎయిర్ పోర్టుతో పాటు రైల్వేజోన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి అంటూ తెగ హడావుడి చేశారు. తీరా అటువంటిదేమీ లేకపోవడంతో తెగ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కేంద్రమే నేరుగా ఎయిర్ పోర్టు విక్రయానికి సిద్ధపడినా వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.