KCR political plan In AP : ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీని లైట్ తీసుకున్నవారికి కేసీఆర్ గట్టి సంకేతాలే ఇచ్చారు. ఎవరికీ అంతుపట్టని విధంగా తోట చంద్రశేఖర్ తో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును పార్టీలోకి రప్పించి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. తాను ఎవరికి టార్గెట్ చేసింది చెప్పకనే చెప్పారు. ఏపీ రాజకీయ యవనికపై బీఆర్ఎస్ ను ఉంచి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో తాను ఒక భాగస్వామ్యం కావడానికి ప్రయత్నిస్తున్నారు. తాను ఎంత ఓటు షేర్ సాధిస్తే తన మిత్రుడు జగన్ కు అంతలా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. అటు తన శత్రువు అయిన చంద్రబాబు, ఆయనతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న జనసేనను దెబ్బతీయ్యాలని చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన ఓటు బ్యాంక్ పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. అందులో భాగంగానే ముందుగా జనసేన నుంచి నరుక్కొని వస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది. రెండు పార్టీలూ పొత్తులపై తరచూ ప్రకటన చేస్తుండడంతో కలిసి పోటీ చేస్తాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అదే జరిగితే అధికార వైసీపీకి దెబ్బే. గత ఎన్నికల జనసేన చీల్చిన ఓట్లతో 40 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అందుకే ఈసారి ఓట్లు చీలిపోనివ్వనని పవన్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అందర్నీ కలుపుకొని వెళతానని ప్రకటించారు. సహజంగా ఇది వైసీపీకి ఎదురుదెబ్బే కాబట్టి ఆ పార్టీ నేతలు జనసేనను టార్గెట్ చేసుకున్నారు. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణతో పాటు వైసీపీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకటి, రెండు అంశాల్లో తప్ప జగన్ ప్రభుత్వంతో కేసీఆర్ కి పేచీ లేదు. పైగా అభివృద్దిలో తనకు జగన్ పోటీదారు కాదు. కేవలం సంక్షేమంతోనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని చూస్తున్న జగన్ మిగతా విషయాల్లో తప్పటడుగులు వేస్తున్నారు. పైగా విభజన హామీలు అమలుచేయాలని పట్టుబడడం లేదు. రాజకీయంగా తనకు అన్నివిధాలా సహకరిస్తుండడంతో ఏపీలో జగన్ అధికారంలోకి వస్తే శ్రేయస్కరమని భావిస్తున్నారు. పైగా తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్ లో నమ్మదగిన మిత్రుడిగా ఉంటారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సాయం చేసినట్టే.. ఈ ఎన్నికల్లో సాయం చేయాలని భావిస్తున్నారు. ఏపీలో – 6 శాతం ఓట్లను చీల్చడం ద్వారా జగన్ కు మార్గం సుగమం చేయడానికి డిసైడ్ అయ్యారు. అటు తన జాతీయ పార్టీకి రీచ్ కావాలని భావిస్తున్నారు.
కేసీఆర్ ముఖ్యంగా కుల సమీకరణలకు తెరతీస్తున్నారు. తన సొంత సామాజికవర్గమైన వెలమలకు దగ్గర చేర్చుకోవాలని భావిస్తున్నారు. అటు వివిధ పార్టీల్లోని కాపు నాయకులను పార్టీలోకి తెచ్చి కాపుల ఓట్లు చీల్చాలని భావిస్తున్నారు. అమరావతికి మద్దతు తెలపడం ద్వారా కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో సభలు, సమావేశాల్లో చంద్రబాబు టీడీపీని యాక్టివ్ చేసే పనిలో ఉండగా.. కేసీఆర్ చంద్రబాబు అండ్ కోకు గట్టి దెబ్బతీసి.. అంతిమంగా జగన్ కు లాభం చేకూర్చాలని భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.