Kaleshwaram : నీటిని ఎత్తడం.. సముద్రంలోకి వదలడం.. 80 వేల కోట్లు పెట్టి కట్టింది ఇందుకేనా?

ఇప్పుడు కూడా.. మేడిగడ్డకు 5.56 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నది. అధికారులు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. అసలు పంపుల జోలికి మాత్రం పోవడం లేదు. వరదల సీజన్‌లో పంపులు నడిపించి... ఎత్తిపోసిన నీటినంతా దిగువకు వదిలిపెట్టి, పరువు పొగొట్టుకునేకన్నా.. మౌనంగా ఉండటమే మేలని అధికారులు భావిస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : July 21, 2023 1:51 pm

Kaleshwaram Project

Follow us on

Kaleshwaram : పనిగల్ల మేస్త్రి ఇల్లు కడితే కుక్క తోక తగిలి కూలిందట!.. ఈ సామెత తీరుగానే ఉంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనితీరు. 80,000 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం మానవ అద్భుతమైన నిర్మితమని బీఆర్‌ఎస్‌ డబ్బా కొడుతుంది. ఆ నమస్తే తెలంగాణ కీర్తించే తీరు చెప్ప వశం కాదు. మొన్నటి దాకా కాళేశ్వరం తెలంగాణ జీవనాడి అని స్తుతించింది. కరువు కాలంలోనూ కాలేశ్వరం ఆదుకుంటున్నదని డబ్బా కొట్టింది. కానీ ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ఆ పత్రిక చెప్పింది సొల్లని, పాలకులు వల్లె వేసింది ఝూఠా అని మరోసారి తేలింది.

ఎత్తిపోతలే చిత్రవిచిత్రం

వర్షాలు ఆలస్యం కావడంతో కింది నుంచి నీటిని పైకి ఎత్తిపోస్తున్నారు. వర్షాలు పడగానే ఆ నీటిని మళ్లీ కిందికి గోదాట్లోకే వదలుతున్నారు. ప్రతీ ఏటా ఇదే తంతు. ఫలితంగా కాళేశ్వరం ఎత్తిపోతలు విచిత్రంగా మారాయి. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావటం, ఎల్‌ నీనో ముప్పు ఉందని వార్తలు వచ్చాయి. ఫలితంగా ఈ ఏడాది కరవు తప్పదేమోననే సంకేతాలు వెలువడ్డాయి. ఈక్రమంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని రాష్ట్రంలోని వివిధ జలాశాయలకు తరలించాలని ప్రభుత్వం ఆగమేఘాల మీద నిర్ణయించింది. ఈ మేరకు జూలై 9 నుంచి భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం సమీపంలోని లక్ష్మీ (మేడిగడ్డ) పంపుహౌస్‌ నుంచి గోదావరి జలాలను 12రోజులపాటు గ్రావిటీ కెనాల్‌ ద్వారా సరస్వతీ(సుందిళ్ల) బ్యారేజీలోకి ఎత్తిపోసింది. 17 నుంచి వర్షాలు పడుతుండడంతో.. మానేరు వాగు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా నీటిని విడుదల చేశారు. ఫలితంగా సరస్వతీ బ్యారేజీకి భారీగా నీరు చేరుతోంది. ఆ బ్యారేజీలో 10.87 టీఎంసీల సామర్థ్యానికిగానూ తొమ్మిది టీఎంసీల వరకు నీరు చేరింది.

దిగువకు విడుదల చేశారు

నీరు భారీగా చేరడంతో గురువారం తెల్లవారు జామున 15 గేట్లు ఎత్తి 18,900 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో తగ్గటం, బ్యారేజీలో 7.72 టీఎంసీల నీరే ఉండటంతో రెండు గేట్లు మాత్రమే ఎత్తి 900 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్క రోజులోనే సుమారు రెండు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయడం ఇక్కడ గమనార్హం. వర్షాలు మరో నాలుగైదు రోజులు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో 12 రోజుల పాటు ఎత్తిన నీళ్లను కూడా మళ్లీ గోదావరిలోకి విడుదల చేయాల్సి వస్తోంది. ఆ నీరు ఎత్తిపోయడానికి రోజూ ఐదు నుంచి ఏడు మోటార్లు రన్‌ చేశారు. ఇప్పుడా నీరంతటినీ దిగువకు విడుదల చేయడమంటే.. కరెంట్‌ బిల్లులు, అధికారుల శ్రమ వృథా గోదావరిలో పోసినట్టే.

100 టీఎంసీలను సముద్రంలోకి తిరిగి వదిలేశారు

2018లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించారు. ఇప్పటిదాకా ప్రభుత్వ లెక్కల ప్రకారం 169 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. కానీ, వర్షాల కారణంగా బ్యారేజీలు నిండాయి. వాస్తవానికి వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నప్పటికీ ఇలా ఎందుకు చేశారో అంతు పట్టకుండా ఉంది. ఇక అందులో 100 టీఎంసీలను సముద్రంలోకి తిరిగి వదిలేశారు. ఇప్పుడు కూడా.. మేడిగడ్డకు 5.56 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నది. అధికారులు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. అసలు పంపుల జోలికి మాత్రం పోవడం లేదు. వరదల సీజన్‌లో పంపులు నడిపించి… ఎత్తిపోసిన నీటినంతా దిగువకు వదిలిపెట్టి, పరువు పొగొట్టుకునేకన్నా.. మౌనంగా ఉండటమే మేలని అధికారులు భావిస్తున్నారు. సుందిళ్లలో సగానికి పైగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసిన నీరే ఉండటం ఇక్కడ విశేషం. ఈ నీళ్ల న్నీ తిరిగి సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. కడెం నుంచి ఎల్లంపల్లికి నీరు చేరితే… అవీ మేడిగడ్డ ద్వారా గోదావరిలో కలుస్తున్నాయి. ఇలా ఎటు చూసుకున్నా పెద్ద ప్రయోజనం కన్పించడం లేదు. మొత్తానికి ఎత్తి పోసిన నీళ్లు తిరిగి గోదావరిలోకి విడుదల చేస్తుండటం పట్ల అటు ప్రభుత్వం, ఇటు అధికారుల పనితీరు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. అన్నట్టు ఈ విద్యుత్‌ చార్జీల భారం ఇప్పటికే సర్కారుకు తడిసి మోపెడవుతోంది. తాజాగా మోటార్లను నడిపించారు. మరి ఆ లెక్క ఎంతయిందో?