BJP Success Formula : ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట ఓడిపోతే తల కొట్టిసినంత పని అవుతుంది. దేశంలోని పవర్ ఫుల్ వ్యక్తులిద్దరూ గుజరాతీలే. ప్రధాని మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరిదీ గుజరాత్ రాష్ట్రమే. అందుకే గుజరాత్ ఎన్నికలను మోడీషాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎంలను మార్చారు. మంత్రులను తొలగించారు.ప్రక్షాళన పేరుతో చాలా కథ నడిపారు. 2017లో కాస్త వెనుకబడిన గుజరాత్ లో ఇప్పుడు ప్రభంజనమే సృష్టించారు. మునుపెన్నడూ రానంత మెజార్టీ సీట్లను బీజేపీ దక్కించుకునేలా చేశారు. ఇంతకీ గుజరాత్ లో బీజేపీ ఎలా గెలిచింది? ప్రతిపక్షాలు ఎందుకు అక్కడ పుంజుకోలేదు? కాంగ్రెస్ గత సారి కంటే ఎందుకు దిగజారింది? ఢిల్లీ, పంజాబ్ ను కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో ఎందుకు తేలిపోయిందన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-ఏడాదిన్నర ముందే మొదలుపెట్టిన మోడీ
2017 ఎన్నికల సమయంలో బీజేపీ ఓడిపోయేది. కానీ పట్టణ ప్రజల్లో ఉన్న పాపులారిటీ.. గుజరాత్ లో పట్టణ జనాభా ఎక్కువ కావడంతో కష్టపడి గెలిచింది. గుజరాత్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, నాటి గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి అశోక్ గహ్లోత్ పకడ్బందీగా ముందుకెళ్లడంతో బీజేపీ 99 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఏకంగా 77 సీట్లు సాధించి షాకిచ్చింది. దీంతో ఈసారి బీజేపీ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ మోడీ, షాలు ఈసారి ఏడాదిన్నర ముందే ‘ఆపరేషన్ గుజరాత్’ మొదలుపెట్టారు. వ్యూహాత్మకంగా గ్రౌండ్ వర్క్ షురూ చేశారు. నరేంద్రమోడీ చరిష్మానే నమ్ముకున్నాయి. క్షేత్రస్థాయిలో విపరీతంగా బీజేపీ మోహరించి శ్రమించారు. దాదాపు ఏడాది ముందు మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఎంత వ్యతిరేకత వస్తుందనుకున్నా వెనుకాడకుండా ఈ పనిచేశారు. ఈ వ్యూహాలు కలిసి వచ్చాయి. వ్యతిరేకత తగ్గించాయి. గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని అందించాయి. ఈసారి 127 సీట్లు సాధించాయంటే ఇదే కారణం.
-సాహసోపేత నిర్ణయాలే బీజేపీకి కలిసివచ్చాయి
ఎన్నికలకు ఏడాది ముందుగానే సీఎంగా ఉన్న విజయ్ రూపానిని, ఆయన మంత్రివర్గాన్ని బీజేపీ పక్కనపెట్టిందంటే ఎంతలా గుజరాత్ కు ప్రాధాన్యమిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పటేల్ ఉద్యమం తర్వాత ఆ సామాజికవర్గానికి అగ్రతాంబూలం కల్పించింది. భూపేంద్రపటేల్ కు సీఎం పగ్గాలు అప్పగించింది. రూపాని ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించింది.కేంద్రమంత్రివర్గంలోకి గుజరాతీ బీసీ వర్గాలైన దేవశీష్ చౌహాన్, దర్శనా జర్ధోష్, మహేంద్ర ముంజుపారకు స్థానం కల్పించింది. 90 నియోజకవర్గాల్లో బలంగా ఉన్న గుజరాత్ లో బీసీలకు అంతే స్థాయిలో సీట్లు ఇచ్చి తనవైపు తిప్పుకుంది. ఇక పనితీరు బాగాలేని 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ నిరాకరించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇందులో మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉండడం సంచలనమైంది. ఇదే బీజేపీపై ప్రజల్లో ఇమేజ్ ను భారీగా పెంచాయి.
-ఉద్యమకారులకు బీజేపీ పెద్దపీట
గుజరాత్లో పటేల్, పటీదార్ ఉద్యమాలను నడిపించిన యువ నేతలు హార్ధిక్ పటేల్, కున్వర్ జీ బవలియాలు, అల్పేశ్ ఠాకూర్ లాంటి వారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. వారిని కాంగ్రెస్ కు దూరం చేయడంలో బీజేపీ విజయం సాధించింది. ఈసారి పాటీదార్లకు ఏకంగా 25శాతం ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంతో ఆ వర్గం బీజేపీ వైపు టర్న్ అయ్యింది.
-ఆమ్ ఆద్మీ పోటీతో వ్యతిరేక ఓటు చీలి లాభం
ఇక ఈసారి గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయడంతో బీజేపీకి కలిసి వచ్చింది. పోయినసారి 41శాతం వరకూ కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు రాగా.. ఈసారి 22 శాతానికి పడిపోయింది. 12 శాతం ఆప్ చీల్చింది. ఇక్కడే కాంగ్రెస్ ఓడి బీజేపీ విజయం సాధించింది. ఆప్ నేత కేజ్రీవాల్ ఉచిత హామీలను బీజేపీ బాగా నమ్మశక్యం కానీ హామీలుగా ప్రొజెక్ట్ చేసి విజయం సాధించింది.
-గుజరాత్ పై మోహరింపు
ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ కేంద్రమంత్రులు, కీలక నేతలు, ఆర్ఎస్ఎస్ దండయాత్రచేస్తాయి. మోడీషాల స్వరాష్ట్రం కావడంతో ఇది మరింతగా ఎక్కువైంది. ఎన్నికల సైన్యమే దిగి దాదాపు 150 మంది కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గాల్లో పకడ్బందీ వ్యూహాలు రచించి వ్యూహాత్మకంగా గెలుపునకు అమిత్ షా సర్వం సిద్ధం చేశారు. కీలక నేతలకు జిల్లాల బాధ్యతలు అప్పగించి విజయం దిశగా నడిపించారు.
-కాంగ్రెస్ గ్రహపాటు.. బీజేపీకి వరం
ఇక 2017లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ స్తాయిలో ఈసారి కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. రాహుల్ పాదయాత్రలో ఉండడం.. సోనియా పట్టించుకోకపోవడం.. కీలక నేతలు ప్రచారానికి రాకపోవడంతో కాంగ్రెస్ నావ గాడితప్పింది. జాతీయ నేతలు రాక.. స్థానిక నేతల్లో దమ్ము లేక ఆ పార్టీ ప్రచారంలో తేలిపోయింది. ‘KHAM ’ వ్యూహం కూడా ఫలించకపోవడంతో నిలువునా ఓడిపోయింది.
-గుజరాత్ లో పట్టణ జనాభా అధికం. అక్కడ మౌలిక సదుపాయాల కల్పన పరిశ్రమల ఏర్పాటుకు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధి వైపు నడిపించింది. దీంతో పట్టణ ఓటర్లంతా బీజేపీ వైపు మొగ్గారు.
-గుజరాత్ లో హిందువులు ఎక్కువ. వారిని ఆకర్షించడంలో బీజేపీ విజయం సాధించింది. బలంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా క్షేత్రస్తాయిలో బలంగా ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండడంతో ఈ పరిణామం బీజేపీకి కలిసి వచ్చింది.
-కేంద్రంలో మోడీషాల బీజేపీ వచ్చాక గుజరాత్ కు పెట్టుబడుల వరద మొదలైంది. ఫాక్స్ కాన్ చిప్ ఫ్యాక్టరీ, రిలయన్స్ నుంచి టాటా ఎయిర్ బస్ వరకూ వేల కోట్ల ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించారు. దీంతో ఉపాధి పెరిగి ప్రజల మద్ధతు పొందడంలో బీజేపీ విజయం సాధించింది. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు నమ్మి బీజేపీకి పట్టం కడుతున్నారు.
-మోడీ బ్రాండ్ సక్సెస్
గుజరాత్ లో మోడీ బ్రాండ్ పనిచేసింది. గుజరాతీ అయిన మోడీకి దేశంలో వెన్నుదన్నుగా నిలవాలంటే సొంత రాష్ట్ర మద్దతు అవసరం ప్రజలు భావించారు. ఆ సెంటిమెంట్ పనిచేసింది. మోడీ కూడా ఒక పీఎం అని మరిచి అందరి వద్దకు వెళ్లి ఓట్లు అడిగాడు. ప్రధాని అయ్యిండి 20 రోజులు గుజరాత్ లోనే ఉన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ర్యాలీలు సహా ప్రచారంచేశాడు. తానే అభ్యర్థినన్నట్టు ప్రజల మెప్పు పొందాడు. మోడీ బ్రాండ్ పనిచేసి గుజరాత్ లో విజయం దక్కింది.
గుజరాత్ లో వ్యతిరేకతను తగ్గించి.. రాష్ట్రపరిస్థితులను అవగతం చేసుకొని.. ప్రజల మెప్పుపొందేలా వ్యూహాలు రచించి అమలు చేసి మరోసారి అధికారాన్ని బీజేపీ సాధించింది. ఇవేం కసరత్తు చేయకుండా కేవలం ఆర్భాటాలతో ప్రచారంచేసిన కాంగ్రెస్, ఆప్ ఓటమి చవిచూశాయి.
ఇంత చిత్తశుద్ధితో ఇవన్నీ చేయడం బట్టే ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. అందలమెక్కిస్తున్నారు. ప్రతి ఓటరును టచ్ చేసి వారి మెప్పు పొందేలా బీజేపీ తయారు కావడమే వారి విజయ రహస్యం అని చెప్పొచ్చు.