Yadagirigutta: భట్టి కింద .‌ రేవంత్ ‘రెడ్డి’లు పైన.. పెను దుమారం

వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాకు విపరీతమైన వేగంగా ఉంది. చిన్న సంఘటన జరిగినా, చీమ చిటుక్కుమన్నా.. వెంటనే అది వ్యాపిస్తోంది. అది నిజమో? అబద్దమో అనవసరం? ఎంతవరకు సర్క్యులేట్ అయ్యిందనేదే ముఖ్యం.. సోమవారం కూడా అదే జరిగింది..

Written By: Suresh, Updated On : March 11, 2024 6:48 pm

Yadagirigutta

Follow us on

Yadagirigutta: ఉదయం నుంచి ఒకటే దుమారం.. మీడియాలో ఒకటే చర్చ.. ఉప ముఖ్యమంత్రి, దళిత నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండా సురేఖను అవమానించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పైన కూర్చున్నారు.. ఇంతకు మించిన దారుణం ఉంటుందా.. దళితులను ఈ స్థాయిలో చిన్నచూపు చూస్తున్నారు.. బీసీలను అణగదొక్కుతున్నారు.చివరికి ప్రభుత్వ ప్రకటనల్లోనూ రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే వేస్తున్నారు.. ఇక ఎమ్మెల్సీ కవిత అయితే రేవంత్ క్షమాపణ చెప్పాలని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇది దళితులకు జరిగిన అన్యాయమని… ఇలా రకరకాల విశ్లేషణలు.. వాదనలు.. ఇంతకీ ఇందులో ఎవరి వాదన కరెక్టు? ఎవరి విశ్లేషణ కరెక్టు?

వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాకు విపరీతమైన వేగంగా ఉంది. చిన్న సంఘటన జరిగినా, చీమ చిటుక్కుమన్నా.. వెంటనే అది వ్యాపిస్తోంది. అది నిజమో? అబద్దమో అనవసరం? ఎంతవరకు సర్క్యులేట్ అయ్యిందనేదే ముఖ్యం.. సోమవారం కూడా అదే జరిగింది.. యాదగిరిగుట్టలో పూజల కోసం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వెళ్లారు. అక్కడి పూజల్లో పాల్గొన్నారు. ఇంతవరకు ఉంటే బాగానే ఉండేది. కానీ అక్కడ జరిగిన పూజల్లో ముఖ్యమంత్రి, ఆయన సతీమణి, మరో ఇద్దరు రెడ్డి మంత్రులు పక్క పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. ఇటు సురేఖ, అటు విక్రమార్క కింద కూర్చున్నారు.. ఇలా ఎందుకు జరిగిందనేదానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని కవిత నుంచి ప్రవీణ్ కుమార్ దాకా డిమాండ్ చేస్తున్నారు. గుడి కాబట్టి అందరూ సమానమే కదా, అలాంటప్పుడు కొందరు కుర్చీలో ఎందుకు కూర్చోవాలి? ఇంకా కొందరు కింద ఎందుకు కూర్చోవాలి అనేది వారి ప్రధాన ఆరోపణ. వారు చేస్తున్న ఆరోపణకు తగ్గట్టుగానే అక్కడ సన్నివేశం కూడా ఉంది. సో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.

వాస్తవానికి ఏదైనా గుడికి ప్రభుత్వ ప్రముఖులు వెళ్లినప్పుడు అక్కడి ఆలయం మర్యాదలతో దర్శనం కల్పిస్తారు. ఇది ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. అక్కడిదాకా ఎందుకు అప్పట్లో భద్రాచలం రాములవారికి కళ్యాణం సమయంలో ముఖ్యమంత్రి మనవడు తన చేతులతో తలంబ్రాలు సమర్పించాడు. దానిని ప్రతిపక్షాలు ఆక్షేపించినప్పటికీ అప్పటి అధికార ప్రభుత్వం లెక్కపెట్టలేదు. అయితే సోమవారం యాదగిరిగుట్ట లో జరిగిన ఘటనలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. కుర్చీల్లో కూర్చోవడం ద్వారా రెడ్డి అనే వాదాన్ని సోషల్ మీడియా వేదికగా గులాబి పార్టీ శ్రేణులు సర్క్యూలేట్ చేస్తున్నారు.. అయితే దీనికి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమాధానం చెప్పలేదు. మరోవైపు కింద కూర్చోవడం వారికి ఇష్టమైనప్పుడు.. మధ్యలో మీ నస ఏంటని గులాబీ శ్రేణులకు కొంతమంది నెటిజెన్లు కౌంటర్ ఇస్తున్నారు. అంతకుముందు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పక్కన భట్టి విక్రమార్కు కూర్చున్నారు. ఆ సమయంలో కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూర్చున్నారు. మరి అప్పుడు రెడ్డి సామ్యం మీకు గుర్తుకు రాలేదా అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి సోమవారం యాదగిరిగుట్టలో జరిగిన ఉదంతాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రచారం చేస్తున్నారు.