Pawan Kalyan- YCP: ఏపీలో వైసీపీ నేతలు పక్కచూపులు చూడడం ప్రారంభించారు. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన నాయకులు తమకు తగినంత ప్రాధాన్యం దక్కక పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. ఈ జాబితాలో ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం. పేరుకే ఎమ్మెల్యేలం కానీ అధికారం కొందరి చేతుల్లో ఉండిపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది. కనీసం తమను కలిసేందుకు కూడా జగన్ అవకాశమివ్వకపోవడంపై వారు అవమానంగా భావిస్తున్నారు. అటు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెల్లుబికుతుండడం కూడా వారు పక్కచూపులకు కారణమవుతోంది. అటువంటి వారంతా ఇప్పుడు జనసేన నేతలకు టచ్ లోకి వెళుతున్నారు. ఇక అధికార పార్టీతో లాభం లేదనుకుంటున్నా వారు జనసేన అధినేత పవన్ ను కలుస్తున్నారు. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీపై అసంతృప్తిగా ఉన్న నాయకులు జనసేనను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలు ఉండడంతో జనసేనే సేఫ్ జోన్ గా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని.. నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని భావిస్తున్న వారు ముందస్తుగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి తమ మనుసలో ఉన్న భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు., అదే సమయంలో పవన్ అచీతూచీ అడుగులు వేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వకుండానే.. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు జనసేన వైపు క్యూకట్టడం ప్రారంభించారు.

పవన్ ను కలిసిన రాజోలు వైసీపీ నేత..
ఇప్పటికే ప్రతీరోజూ ఒకరిద్దరు నాయకులు పవన్ ను కలుస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల కిందట గుడివాడ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు పాలంకి బ్రదర్స్ జనసేనలో చేరారు. వీరు మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులు. నాని వ్యవహార శైలి నచ్చక పార్టీని వీడారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి జనసేన తరుపున పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలో రాజోలు వైసీపీ నాయకుడు బొంతు రాజేశ్వరరావు చేరారు. గత రెండు ఎన్నికల్లో ఆయన రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేయాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసి తన మనసులో ఉన్న మాటను చెప్పారు. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గ నుంచి మాజీ ఐఏఎస్ కు టిక్కెట్ ఇవ్వనున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ ఆవిర్బావం నుంచి వైసీపీ బలోపేతానికి కృషిచేసిన బొంతును అధిష్టాన పెద్దలు పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన తన రాజకీయ ప్రయాణానికి జనసేనే సేఫ్ జోన్ గా భావిస్తున్నారు.
Also Read: AP Politics: ఏపీ రాజకీయాల్లో బూతుల పరంపర
పునరాలోచనలో రెడ్డి సామాజికవర్గం…
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైసీపీ లీడర్ శివరామిరెడ్డి కూడా జనసేనలో చేరారు. వైసీపీ బలోపేతానికి కష్టపడినా తన సేవలను గుర్తించకపోవడంతో జనసేన వైపు మొగ్గుచూపారు. రెడ్డి సామాజికవర్గం నేత పవన్ వైపు చూడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువ అన్న ప్రచారం ఉంది. అయితే వైసీపీ గవర్నమెంట్ లో ఒకరిద్దరు కీలక నాయకులు తప్పించి ఎవరికీ మేలు జరగలేదదని క్షేత్రస్థాయిలో టాక్ నడుస్తోంది. వారంతా తమ రాజకీయ వేదికగా జనసేనను ఎంచుకున్నట్టు టాక్ అయితే ఉంది. ఇప్పటికే ఇటువంటి నాయకులంతా జనసేన నాయకులకు టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. ఒకటి రెండు నెలల్లో జనసేనలో చేరికలు ఊపందుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి వారంతా చేరేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.

వైసీపీ ఎమ్మెల్యేల్లో కలవరపాటు..
జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఖాయమన్న సంకేతాలు ఉండడంతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా కలవరం ప్రారంభమైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పొత్తు ప్రభావం అధికంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. అందుకే ముందస్తుగా కర్చిఫ్ వేయడం ప్రారంభించారు. కానీ పొత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ అచీతూచీ వ్యవహరిస్తున్నారు. బేషరతుగా చేరిన నాయకులకు ఎటువంటిఅడ్డంకులు చెప్పడం లేదు. పదవులను ఆశిస్తున్న వారి విషయంలో మాత్రం ముందస్తుగా మాట ఇవ్వడం లేదు. అయితే చాలా జిల్లాల్లో జనసేనకు నాయకత్వ లేమి ఉంది. అటువంటి చోట మాత్రం కొద్ది నెలల్లో వైసీపీ నేతల చేరికతో ఖాళీలు భర్తీ చేసుకునే అవకాశముంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జనసేనలో చేరికలు భారీగా ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాలు శరవేగంగా మారే అవకాశముంటుందని చెబుతున్నారు.
Also Read:Divorce Celebration: భార్యల టార్చర్ అంతుంటుంది మరీ.. విడాకుల ‘భర్తలు’ ఏం చేశారో తెలిస్తే తట్టుకోలేరు