Reddy – Kamma – Kapu : కులం కూడుపెట్టదంటారు..కానీ ఏపీలో ఆ మాట చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఇక్కడ సం‘కుల’ సమరానికి జనాలు అలవాటు పడిపోయారు. ప్రజలు సైతం కులాలుగా విడిపోయారు. ఆయా కులాల పక్షనే నిలబడుతున్నారు, వారికే ఓట్లు వేస్తున్నారు. ఉమ్మడి ఏపీ నుంచే ఈ తంతు కొనసాగుతూ వస్తోంది. కమ్మ, కాకపోతే రెడ్డి అన్న చందంగా మారింది ఇక్కడి రాజకీయం. ఇప్పుడు కాపుల పక్షాన జనసేన వచ్చింది. ఏపీలో ఇప్పుడు ప్రధాన సామాజికవర్గాల మధ్యే రాజకీయం తిరుగుతోంది. అయితే ఈ మూడు కులాలు ఒక్కటేనన్న వాస్తవం కాలగర్భంలో కలిసిపోయింది. విషయాన్ని చారిత్రక పరిశోధకుడు, రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ కొన్ని నగ్న సత్యాలను వెల్లడించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
8వ శతాబ్దం వరకూ కమ్మ కాపు రెడ్డి ఈ మూడూ ఒకే కులంగా ఉండేవట. పొలం కాపుకాసేవారిని కాపులుగా పేర్కొనేవారట. రెడ్డి అంటే రట్టోడట. దేశానికి రక్షణ కల్పించేవారుట. కమ్మవాళ్ళు రాజ్యాలనే ఏలేవారట. కరికాల చోళుడికి కమ్మలతో లింకులు ఉన్నట్లుగా శాసనాలు లభించాయి అని ఆయన తెలియచేశారు. రాజ్యాధికారం కోసం ఈ మూడు కులాలు నెమ్మదిగా తరువాత శతాబ్దాలలో విడిపోయినట్లు చెప్పారు.చరిత్రలు ఒక్కసారి తీసుకుంటే అన్ని కులాలు రాజ్యాలు ఏలిన సందర్భాలు ఉన్నాయి. శతాబ్దాల క్రితం ఎక్కడికక్కడ స్థానిక రాజులు తమ ప్రతిభను, పౌరుషాన్ని చూపించి పాలించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆనాడు కుల భావన ఎక్కువగా ఉండేది కాదు అన్నది చరిత్ర పుటలను చూస్తే అవగతమవుతోంది.
దేశం పరాయి పాలనలో మగ్గిన తరువాత కులభావనలు అధికమయ్యాయి. విభజించు పాలించు అన్న సిద్ధాంతం తెరపైకి రావడంతో కులభావన రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. మేము, మావారు అన్న ఫీలింగ్ అధికమైంది. అయితే ఏపీలో ప్రధాన మూడు సామాజికవర్గాల ఆర్థిక స్థితిగతులు, ఆచార, వ్యవహారాల్లో చాలావాటికి భావసారుప్యత ఉంది. మూడు కులాలు దాదాపు ఒక్కలానే ఉంటాయి. గతంలో కూడా మూడు కులాలు ఒక్కటేనని చాలా మంది ప్రకటించిన సందర్భాలున్నాయి. ఇటువంటి తరుణంలో ముదిగొండ శివప్రసాద్ వ్యాఖ్యాలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపైలోతైన చర్చ జరుగుతోంది.
అయితే కులాల గురించి మేధావులు, రాజకీయ పార్టీల నేతలు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు.
కులం ఊసు ఎత్తకుండా పొద్దు పుచ్చడం నేతాశ్రీలకు ఇష్టం ఉండదు, కులం గోడు వద్దు అంటూనే మన మేధావులు ఆ ఊసే తెస్తారు. ఇక ఏ పథకం ప్రకటించినా కూడా దానికి కులం ట్యాగ్ తగిలించి జనాలకు అందించకపోతే సంతృప్తి అసలు ఉండదు. కులం చూడం, మతం చూడం అన్న మాటలు సైతం తరచూ వినబడుతుంటాయి. కానీ అవే కులాల పరిగణ లేకుండా ఒక్కటంటే ఒక్క నిర్ణయం వెలువడదంతే అతిశయోక్తి కాదు.