Pawankalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రాణ హానీ ఉందా? ఈ విషయం ఆయనే స్వయంగా ప్రకటించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పవన్ వారాహి యాత్రలో ఉన్నారు. జనసేనకు అత్యంత బలం ఉన్న ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయన యాత్రకు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. జన నీరాజనాలు పలుకుతున్నారు. అటు జనసేన గ్రాఫ్ పెరుగుతుండగా.. తమ అధికారాన్ని కదిలిస్తారన్న భయం వైసీపీని వెంటాడుతోంది. అందుకే పవన్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అందుకే జనసేన నాయకత్వం అలెర్టయ్యింది.
వారాహి పాదయాత్ర ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. దారిపొడవునా యాత్రతో పాటు భారీ బహిరంగ సభలు ఏర్పాటుచేస్తున్నారు. విరామ సమయంలో పార్టీ శ్రేణులు, మేధావులు, పలు రంగాల ప్రముఖులతో పవన్ సమావేశమవుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సంబంధించి సలహాలు, సూచనలు అడుగుతున్నారు. వైసీపీ సర్కారు చేతిలో దగాకు గురైన వర్గాల వారికి భరోసా కల్పిస్తున్నారు.
అయితే పవన్ భద్రతపై జనసేన నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తనకు ప్రాణహాని ఉందని పవన్ ప్రకటించడమే కారణం. శనివారం కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ నేతలతో పవన్ సమావేశమయ్యారు. తనను మట్టుబెట్టేందుకు సుపారీ గ్యాంగులు రంగంలోకి దిగాయని సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. జనసేన నేతలు, జన సైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా, రక్షణ ప్రమాణాలు పాటించాలని కోరారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ వారికి పిలుపునిచ్చారు.
తాను సినిమా నటుడిగా కాకుంటే.. ఓ బలమైన నాయకుడిగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లి ఉండేవాడినని గుర్తుచేశారు. విపరీతమైన అభిమానగానం ఉండడంతో అది సాధ్యం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా వైసీపీకి దక్కకూడదని శపధం చేశారు. అయితే తమకు అధికారం దూరమవుతుందని.. వైసీపీ నేతలు ఎంతకైనా తెగిస్తారని పవన్ హెచ్చరించారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జన సైనికులు, వీర మహిళలపై చేసిన దాడులను మరిచిపోలేదన్నారు. ప్రత్యేక కార్యాచరణతో జన సైనికులను కాపాడుకుంటానని చెప్పారు. మొత్తానికైతే అటు తనకు ప్రాణహానీ ఉందని చెప్పడంతో పాటు శ్రేణులు అలెర్టుగా ఉండాలని పవన్ పిలుపునివ్వడం ఓకింత ఆందోళనకు గురిచేస్తోంది.