KCR Govt Schemes : సర్కార్ సాయం బంద్.. కేసీఆర్ కు ఇది పెద్ద దెబ్బ

ఇప్పుడు కోడ్‌ అమల్లోకి రావడంతో ఎన్నికల తరువాత అందిస్తామంటూ అధికార పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : October 12, 2023 6:55 pm
Follow us on

KCR Govt Schemes : దళితులకు దళితబంధు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు మైనార్టీ బంధు, గృహ లక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరాకు కొత్తగా అర్హులైన వారికి పింఛన్‌.. ఇలా వివిధ వర్గాల వారి కోసం ప్రభు త్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఎక్కడి పథకాలు అక్కడే నిలిచిపోయాయి. వాస్తవానికి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని సర్కారు భావించింది. కానీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, అర్హుల ఎంపిక తదితర అంశాల్లో సమస్యలు తలెత్తడంతో జాప్యం జరిగింది. ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నా ఎన్నికల నిబంధనావళి అడ్డంకిగా మారింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి వీల్లేకపోగా.. ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లోనూ కొత్త లబ్ధిదారుల గుర్తింపునకు అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేనాటికి అర్హులుగా గుర్తింపబడి జాబితా సిద్ధమైన వారికి మాత్రం అందుకు సంబంధించిన లబ్ధిని అందించేందుకు అవకాశం ఉంది. దీంతో కొత్త వారి గుర్తింపు, పథకాల అమలు మొత్తం ఎన్నికల తరువాతే తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే నవంబరులో జరగబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ పలు కొత్త పథకాలను ప్రకటించే యోచనలో ఉన్నాయి. ఇందుకు తమ మ్యానిఫెస్టోల్లో వాటిని పొందుపరుస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నిలిచిన పథకాలు, కొత్తగా ప్రకటించబోయే పథకాలన్నీ ఎన్నికలు ముగిశాక వచ్చే ఏడాది జనవరి నుంచి మాత్రమే అమల్లోకి వస్తాయని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.

అంతంతమాత్రమే

2021 జూలైలో తీసుకొచ్చిన దళితబంధు పథకం.. లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఈ పథకాన్ని ప్రభుత్వం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఫైలట్‌ ప్రాజెక్టుగా 2021 జూలైలో ప్రారంభించింది. అనంతరం మళ్లీ ఏడాది ఆగస్టులో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రి గ్రామంలోనూ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. తొలి ఏడాదిలో కొంతమందికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చిన అనంతరం రెండో విడత కింద 2022-23లో నియోజకవర్గానికి 1500 మంది చొప్పున 2.82 లక్షల మందికి అందజేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అందుకోసం బడ్జెట్లో రూ.17,700 కోట్ల నిధులనూ కేటాయించింది. కానీ, ఆ నిధుల్లో నుంచి నయా పైసా ఖర్చు చేయలేదు. ఫలితంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్కరికి కూడా సాయం అందలేదు. మళ్లీ పథకం అమలు కోసమంటూ రూ.17,700 కోట్ల నిధులను 2023-24 బడ్జెట్‌లోనూ ప్రభుత్వం కేటాయించింది. రెండో విడత దళిత బంధు పథకం కింద ఒక్కో నియోజకవర్గంలో 1100 మందికి అందించాలని క్యాబినెట్‌ ఆమోదించింది. దీని ప్రకారం 1,29,800 యూనిట్లు అందాలి. కానీ, ఇప్పటివరకు కేవలం 162 యూనిట్లు మాత్రమే అందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రెండో దఫా కోసం ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15 వేల మందిని మాత్రమే గుర్తించినట్లు సమాచారం. దీంతో రెండో విడతలోనూ దళితులకు ఆశించిన మేర లబ్ధి చేకూరలేదు. ఇప్పుడు కోడ్‌ అమల్లోకి రావడంతో ఎన్నికల తరువాత అందిస్తామంటూ అధికార పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు.

గృహలక్ష్మికి బ్రేక్‌

సొంతస్థలం కలిగి ఉండి ఇంటిని నిర్మించుకునే పేదలకు రూ.3 లక్షల సాయం చేసే గృహలక్ష్మి పథకానికి కూడా బ్రేక్‌ పడింది. ఈ పథకానికి ప్రభుత్వం 2023 జూన్‌ 21న మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇండ్లకు తక్కువ కాకుండా నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.ఒక్కో ఇంటికి రూ.3 లక్షల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి సాయం అందిస్తామని తెలిపారు. ఇందుకోసం 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించినట్టు పేర్కొన్నారు. వీటిలో బలహీన వర్గాల గృహనిర్మాణ కార్యక్రమం ‘గృహలక్ష్మి’ పథకానికి రూ.7,350 కోట్లను కేటాయించారు. కానీ, ఈ పథకం అమలుకు జూన్‌లో మార్గదర్శకాలు వచ్చినా.. లబ్ధిదారుల గుర్తింపు, అమలు మాత్రం ఆశించిన మేర జరగలేదు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15.05 లక్షల దరఖాస్తులు రాగా, వీటిలో 4.6 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. 10.05 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులోనూ ఎన్నికల కోడ్‌ వచ్చే నాటికి సుమారు 1.85 లక్షల మందికి మాత్రమే ఇంటి నిర్మాణానికి అవసరమైన మంజూరు పత్రాలను అందించినట్టు తెలుస్తోంది.

బీసీ, మైనారిటీల్లోని చేతివృత్తులు నిర్వహించుకునే వారికి ఆర్థిక సాయం కింద రూ.లక్ష అందించే పథకం కూడా నిలిచిపోయింది. ఈ పథకం కింద లబ్ధి కోసం బీసీ వర్గాల నుంచి దాదాపు 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అధికారులు పరిశీలన జరిపి అర్హులైన వారికి పథకాన్ని ప్రతినెలా 15వ తేదీ నుంచి అందిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మైనారిటీలకు అందించే సాయం విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ఆసరా పింఛన్‌ కోసం వచ్చిన కొత్త దరఖాస్తులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులను కూడా నిలిపివేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఎంపికైన వారు మినహా కొత్తవారికి అవకాశం లేదు. అయితే ఇప్పటివరకు గుర్తించిన వారికి మాత్రం నియోజకవర్గాల్లో చెక్కులను అందించనున్నారు. అయితే ఆ చెక్కులను కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అందించవచ్చా? లేక అధికారులే అందించాలా? అన్నది తెలియాల్సి ఉంది.