YS Jagan Vs Chandrababu : చంద్రబాబు రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు. తొలుత మిత్రులుగా ఉన్న వీరు ప్రత్యర్థులుగా మారారు కానీ శత్రువులుగా మారలేదు. మిత్రధర్మాన్ని కొనసాగించారు. రాజకీయంగా విభేదించుకున్నా స్నేహితులుగా మాత్రం గుర్తించబడ్డారు. అయితే చంద్రబాబు, జగన్ ల విషయంలో అలా కాదు. తన జైలు జీవితానికి చంద్రబాబే కారణమన్న కసి జగన్ లో ఉంది. తండ్రి రాజశేఖర్ రెడ్డినే ఢీకొట్టాను జగన్ ఒక లెక్క అన్న అభిప్రాయం చంద్రబాబులో ఉంది. దీంతో వీరి మధ్య ఎత్తులు, పైఎత్తులు సాగుతున్నాయి. ఒకరినొకరు ఒకసారి ఓడించుకొని సమ ఉజ్జీలుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఆధిపత్యం కొనసాగించాలని చూస్తున్నారు.
తమ వ్యక్తిగత వైరాన్ని రాజకీయాన్ని జోడిస్తున్నారు.ప్రజా మద్దతుతోనే ఒకరినొకరు ఢీకొట్టాలని చూస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు. నవరత్నాలను అమలుచేసి ప్రజల్లో పట్టుకోసం ఆరాటపడుతున్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం అమలుచేసినట్టు చెబుతున్నారు. అయితే సంక్షేమం మాటున రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారని.. 20 ఏళ్ల పాటు అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఏపీ భవిష్యత్ ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తనకు వ్యతిరేకంగా కేంద్ర పెద్దలను, మిగతా రాజకీయ పక్షాలను చంద్రబాబు ఏకతాటిపైకి తేవడాన్ని జగన్ సహించలేకపోతున్నారు. అందుకే ప్రజల్లో బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. క్లాస్, మాస్ వార్ అంటూ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. నేను పేదలకు పంచుతుంటే.. పెత్తందారుల ప్రతినిధి అయిన చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. తనకు ఎవరి సపోర్టు లేదని.. తనకున్నది ప్రజల బలమేనని చెప్పుకొస్తున్నారు. మీ ఇంటికి ప్రభుత్వం సాయం అంది ఉంటేనే తమకు మరోసారి ఓటు వేయాలని కోరుతున్నారు. సహజంగానే ఇది టీడీపీకి డిఫెన్స్ లో పడేసే విషయమే.
జగన్ ఎత్తుగడలకు తిప్పికొట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. గత నాలుగేళ్లుగా జగన్ సర్కారు చర్యలతో రాష్ట్రం దారుణంగా దెబ్బతిన్నదని మేధావులు, నిపుణులతో చెప్పిస్తున్నారు. భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేయిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరో శ్రీలంక, వెనిజుల మాదిరిగా మారనందని ప్రచారం చేస్తున్నారు. సహజంగానే ఈ తరహా ప్రచారం విద్యాధికులు, ఉన్నతరంగాలు, మధ్యతరగతి ప్రజల్లోకి వెళుతోంది. అయితే జగన్ క్లాస్, మాస్ వార్, ఇటు చంద్రబాబు వ్యూహంలో.. ఏది వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ. ప్రజలు ఎవరి మాటలను విశ్వసిస్తే వారే సక్సెస్ అయ్యేది.