MSK Vs Rayudu : 2019 వరల్డ్ కప్ జట్టులో తనకు చోట దక్కకపోవడంపై తెలుగు క్రికెటర్, మాజీ ఆటగాడు అంబటి రాయుడు మరో తెలుగు క్రికెటర్, అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తను వరల్డ్ కప్ ఆడకుండా చేశాడని ఆరోపించాడు. ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు.. ఇటీవల పలు న్యూస్ చానెళ్లు, పత్రికళకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ జట్టులో స్థానం గురించి అడిగిన ప్రశ్నలకు తనను కొంతమంది కావాలనే ఆడకుండా చేశారని ఆరోపించాడు.
ఎట్టకేలకు స్పందించిన ఎమ్మెస్కే..
వన్డే ప్రపంచ కప్ – 2019 టోర్నీలో తనను ఆడనీయకుండా అడ్డుకోవడంలో కొందరి పాత్ర ఉందని అంబటి రాయుడు చేస్తున్న ఆరోపణలపై అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్, టీమిండియా మాజీ ఆటగాడు, ఎమ్మెస్కే ప్రసాద్ ఎట్టకేలకు స్పందించాడు. టీమిండియా జట్టులో నాలుగో స్థానంలో రాయుడు సరిపోతాడని అంతా భావించిన తరుణంలో.. అనూహ్యంగా విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆ నిర్ణయం తన వ్యక్తిగతం కాదని అన్నారు. అతడిని తీసుకోవడం, తీసుకోకపోవడం ఐదుగురితో కూడిన సెలెక్షన్ కమిటీ సమష్టిగా తీసుకున్నదని పేర్కొన్నాడు.
ఒక్కడి నిర్ణయంతో జరిగేది కాదు..
ఏ టోర్నీకి అయినా టీమిండియా జట్టు ఎంపిక ఏ ఒక్కరో ఎంపిక చేయరని ఎమ్మెస్కే స్పష్టం చేశారు. సాధారణ టోర్నీకే సెలక్షన్ కమిటీలోని ఐదుగురు సభ్యులు ఎంపిక చేస్తారని తెలిపారు. ఇక ప్రపంచకప్ జట్టు ఎంపికై ఎంతో కసరత్తు ఉంటుందన్నారు. ఒక్కరు చెప్పగానే అందరూ ఆమోదించేలా జట్టు సభ్యుల ఎంపిక కూర్పు ఉండదని వెల్లడించారు. కమిటీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని తెలిపారు. ఒక్కరే నిర్ణయం తీసుకుంటే ఐదుగురు సభ్యులు ఎందుకని ప్రశ్నించారు. ప్రతీ ప్రపోజల్‌పై ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ‘నేను చేసిన ప్రతిపాదనను కూడా ఇతర సభ్యులు వద్దని చెప్తారు. కొందరు ఆమోదిస్తారు. అంతేకానీ ఎక్కడా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు’ అని వెల్లడించారు.
నాడు మామధ్య విభేదాలు లేవు..
2005 సమయంలో నాకు, రాయుడుకు విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని ఎమ్మెస్కే పేర్కొన్నారు. వాటిని ఆయన ఖండించారు. ‘అతడికి నా కెప్టెన్సీ శైలి నచ్చలేదు. అందులో ఎలాంటి తప్పులేదు. ప్రతీ విషయంలోనూ నేను కాస్త కఠినంగా ఉంటా. ఫిట్‌నెస్, ఆటతీరు ఇలా ప్రతి అంశంలో ఉండటం వల్ల అతడికి నచ్చకపోవచ్చు’ అని పేర్కొన్నారు. అంతేకానీ ఇతర అంశాలు ఏవీ లేవని ఎంఎస్కే ప్రసాద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్‌లో రాయుడుకి స్థానం దక్కకపోవడంపై అప్పటి రాజకీయ నేత కూడా చక్రం తిప్పాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై మాత్రం ఎమ్మెస్కే మాట్లాడలేదు.