Visakhapatnam Metro: విశాఖపట్నం( Visakhapatnam).. దేశంలోనే పర్యాటక నగరం. ఇప్పటివరకు పర్యాటకంగానే గుర్తింపు పొందింది ఈ నగరం. కానీ ఇకనుంచి ఐటీ పరంగా కూడా గుర్తింపు పొందనుంది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ఐటీ అనుబంధ పరిశ్రమలు కూడా వెల్లువలా తరలివస్తున్నాయి. మరో 10 ఏళ్లలో ఐటీ పరంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సరసన నిలవనుంది విశాఖ. ముఖ్యంగా విశాఖ నగర శివారులో ఉన్న కాపులుప్పాడ ఏపీలోనే సరికొత్త ఐటీ విప్లవానికి కేంద్ర బిందువుగా మారనుంది. కొద్దికాలంలోనే ఈ ప్రాంతంలో ఆధునిక ఐటీ పార్కులు, అత్యున్నత స్థాయి కార్యాలయాల సముదాయాలు, గ్లోబల్ టెక్ కంపెనీల రాకతో ఒక శక్తివంతమైన ఐటీ కారిడార్ గా రూపాంతరం చెందనుంది.
* ఐటీ హబ్ గా..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖను ఐటి పరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఐటి హబ్ గా( IT hub) ప్రకటించింది. ఈ క్రమంలోనే మౌలిక సదుపాయాల కల్పన, భారీ పెట్టుబడులకు పెద్దపీట వేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కాపులుప్పాడ పై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నాయి. తాజాగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆర్.ఎం.జెడ్ గ్రూపు దాదాపు పది బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఇక్కడ పది మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జిసిసి పార్కును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు కాగ్నిజెంట్ 8000 మందికి ఉపాధి కల్పించే భారీ క్యాంపస్ ను ఇక్కడ నిర్మిస్తోంది. అదానీ గ్రూప్, గూగుల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఏఐ హబ్ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని డేటా హబ్ గా మార్చడంలో కీలకపాత్ర పోషించనుంది.
* భోగాపురం ఎయిర్పోర్ట్ తో..
ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ ( bhogapuram airport )నిర్మాణం చివరి దశకు వచ్చింది. ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. జూలై నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విశాఖ నగరం నుంచి విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించేలా వి ఎం ఆర్ డి ఏ ఆధ్వర్యంలో రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. బోయపాలెం- కాపులుప్పాడ లింక్ రోడ్లు, ఆరు వరసల బీచ్ కారిడార్ ఈ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఐటి హిల్స్ ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం ఖరీదైన ప్రాంతంగా మారింది.
* లక్షల ఉద్యోగాలు..
కాపులుప్పాడ( kapu lupada) అనేది సాఫ్ట్వేర్ రంగానికి కాదు.. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలకు చిరునామాగా మారబోతోంది. రానున్న ఐదేళ్లలో లక్షల ఉద్యోగాలు ఇక్కడ కల్పించనున్నాయి. లక్షలాదిమందికి ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి. మెట్రో నగరాల జాబితాలో విశాఖ చేరడం ఖాయం. ఇప్పటివరకు పర్యాటకంగానే విశాఖ గుర్తింపు ఉంది. ఇకనుంచి మెట్రో వైపు పరుగు తీయనుంది.