Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి ది( Vijay Sai Reddy) ప్రత్యేక పాత్ర. వైయస్ కుటుంబానికి ఆడిటర్ గా వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి నమ్మినబంటుగా మారారు. ఆయనతో పార్టీ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే.. కర్త,కర్మ, క్రియ అంతా విజయసాయిరెడ్డి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నంబర్ 2 గా వ్యవహరించారు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఏడాది కిందట జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ పై ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చేసారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు కానీ.. ఇంకా రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు.. ఇటీవల ఒక సంచలన ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కోటరి నుండి బయటపడాలని సూచన చేశారు. అదే సమయంలో జగన్ పై విమర్శన పూర్వక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానంతో ఉన్నారని.. తిరిగి వైసీపీలో చేరిపోతారని విజయసాయిరెడ్డి పై ప్రచారం సాగుతోంది.
* కోటరీ ఊరుకుంటుందా?
అయితే వైసీపీని( YSR Congress party) వీడే క్రమంలో రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. కూటమి పార్టీలకు లబ్ధి చేకూర్చారు. అయితే ఇప్పుడు జగన్ మంచిని కోరుకుంటున్నట్టు సంకేతాలు పంపిస్తున్నారు. అయితే ఇంత జరిగాక విజయసాయిరెడ్డి వైసీపీలోకి తిరిగి వెళ్తారా అనేది ఒక అనుమానం. అలా వెళ్తే ఆయనకు విలువ ఉంటుందా? అనేది మరొక అనుమానం. అయితే విజయసాయిరెడ్డి వైసీపీలోకి వెళ్తే ఇన్నాళ్లు కోటరీ అంటూ ఆరోపణలు చేసిన వారు ఊరుకుంటారా? అనేది ఇంకో అనుమానం. ఇన్ని అనుమానాల మధ్య విజయసాయిరెడ్డి వైసీపీలో చేరేందుకు అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ రాజకీయాలు అన్నాక ఏదైనా సాధ్యమే.
* అంత విలువ ఉండదు..
జగన్మోహన్ రెడ్డి స్వభావం విజయసాయి రెడ్డికి తెలుసు. ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్లిన మునుపటి విలువ ఉండదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి వెళ్లరు. జగన్మోహన్ రెడ్డి చేర్చుకోరు అనే టాక్ వినిపిస్తోంది. అయితే విజయసాయిరెడ్డి వైసిపి కోటరీ పై ఆగ్రహంగా ఉన్నారని.. ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. ఎంతో పెద్ద బలమైన నేతలు కోటరీ మాటలు విని.. బలహీనులైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపై భిన్న స్పందన వస్తోంది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేందుకా.. లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అశాంతి కోసమా అనేది హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇన్ని పరిణామాలు నడుమ విజయసాయి రెడ్డికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.. ఒకవేళ వైసీపీలో చేరినా ఆయన ఇమడలేరు.