Pragathi Bhavan: ప్ర”గడీ”భవన్ ఇనుపకంచెల తొలగింపు

ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వందల కోట్ల ఖర్చుతో బేగంపేటలో ప్రగతిభవన్ నిర్మించారు. ప్రగతి భవన్ ముందు పెద్ద ఇనుప స్తంభాలతో కంచె ఏర్పాటు చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 7, 2023 1:27 pm

Pragathi Bhavan

Follow us on

Pragathi Bhavan: మొన్నటిదాకా అది కెసిఆర్ అధికారిక నివాసం. అందులో సామాన్యులకే కాదు మంత్రులకు కూడా కొన్ని సార్లు ప్రవేశం ఉండేది కాదు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కూడా ప్రవేశం లభించక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. గద్దర్ లాంటి ప్రజా గాయకుడు కూడా ఆ ప్రగతి భవన్ వెలుపల నిరీక్షించిన రోజులు కూడా ఉన్నాయి. అత్యంత శత్రు దుర్భేద్యంగా.. కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రవేశం లభించే లాగా అందులో ఏర్పాట్లు ఉండేవి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇన్నాళ్లు ప్రజలకు ఆటంకంగా, వారిని లోపలికి రానీయకుండా ఉన్న ఇనుపకంచలు తొలగిపోతున్నాయి. ఇన్ని రోజులపాటు బేగంపేట రోడ్డును కొంతవరకు ఆక్రమించిన ఇనుప చువ్వలు తొలగింపునకు గురవుతున్నాయి. మొత్తానికి ప్ర”గడీ” భవన్ కాస్తా ప్రజా భవన్ గా మారుతోంది.

నిన్నటి వరకు అది ఒక కోట

ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వందల కోట్ల ఖర్చుతో బేగంపేటలో ప్రగతిభవన్ నిర్మించారు. ప్రగతి భవన్ ముందు పెద్ద ఇనుప స్తంభాలతో కంచె ఏర్పాటు చేశారు. దానికి సోలార్ విద్యుత్ అనుసంధానం చేశారు. ప్రగతి భవన్ నిర్మించిన నటించి ప్రజలు ఎవరికీ కూడా అందులో ప్రవేశం లేకుండా చేశారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు దాదాపు 12 ,13 అడుగులతో ఇనుప కంచె నిర్మించారు. కొద్ది రోజులపాటు ఆరోగ్యశ్రీ గ్రీవెన్స్, రోగుల కోసం సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న షెడ్ వినియోగించేవారు. పైగా ప్రగతిభవన్ ముందు ఉన్న రోడ్డు డివైడర్ మీద కూడా మూడు, నాలుగు అడుగులతో ఒక ఐరన్ కంచె ఏర్పాటు చేశారు. ప్రగతిభం ముందు నుంచి వెళ్లే ప్రజలకు అది ఒక కోటలాగే కనిపించేది. 200 మీటర్ల సమీపము నుంచే పోలీసు బందోబస్తు ఉండేది. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేవి.. పైగా అదంతా చూస్తుంటే రాజుల పరిపాలన మాదిరిగానే కనిపించేదని చాలామంది పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.. అయితే ఈ ఎన్నికల్లో కెసిఆర్ కు ఈ ప్ర”గడి” భవన్ కూడా ఒక ప్రతిబంధకమైందని మేధావులు చెబుతున్నారు.

ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందిగానే ఉండేది

ఇక ఈ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందిగానే ఉండేది. తను ఎవరినైతే కలవాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే కేసీఆర్ నుంచి ఆహ్వానం లభించేది. మిగతావారు కలవాలి అనుకున్నా కూడా కెసిఆర్ దర్శన భాగ్యం లభించేది కాదు. ఎమ్మెల్యేలను కూడా ముఖ్యమంత్రి కలవకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని అప్పట్లో విమర్శలు వినిపించాయి.

రేవంత్ రెడ్డి ఆరోజే చెప్పారు

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామని పలుమార్లు చెప్పారు. చెప్పినట్టుగానే ప్రస్తుతానికి ప్రగతి భవన్ ను అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తామని ప్రకటించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించిన విధంగానే.. ప్రగతి భవన్ లోనూ గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వారి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తారు. అంతేకాదు ప్రజలు వచ్చి దరఖాస్తులు ఇచ్చే విధంగా అక్కడ క్యూ లైన్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా బేగంపేట రోడ్డుపై ఉన్న ఇనుపకంచెను తొలగిస్తున్నారు.. అంతేకాదు వివిధ సమస్యలపై ప్రగతి భవన్ కు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక హాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో ప్రగతి భవన్ లో మార్పులపై చర్చించే అవకాశం ఉంది.