Group 4 exam Update : తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్న ఇచ్చినట్లే.. ఈరోజు జరిగిన TSPSC గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ఒక ప్రశ్న వేశారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ‘బలగం’ సినిమాకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. TSPSC గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ఓ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షను భారీ భద్రత మధ్య శనివారం నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 9.5 లక్షల మంది హాజరైనట్లు తెలుస్తోంది. పేపర్ 1 పరీక్ష అక్కడక్కడా చిన్నచిన్న సమస్యలు తప్ప సజావుగా సాగినట్లు తెలుస్తోంది. కానీ ఈ పరీక్షలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘బలగం’ సినిమాపై ప్రశ్న వేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్నాపత్రానికి సంబంధించిన పేపర్ కట్ అసలు ఏం ప్రశ్న వేశారంటే…

-గ్రూప్ 4లో వచ్చిన ప్రశ్న ఏంటంటే..
ఇకపోతే డైరెక్టర్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎఫెక్ట్ టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షపై పడింది. పేపర్ -1లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రశ్నలు రాగా.. ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభించిన ‘బలగం’ చిత్రం నుంచి ఒక ప్రశ్న అడిగారు. ‘బలగం సినిమాకి సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి అంటూ.. మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, సంగీత దర్శకుడు, కొమరయ్య పాత్ర పేర్లను ప్రస్తావించారు. ఈ ప్రశ్నలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో “బలగం” చిత్రానికి లభించిన గుర్తింపు.. ప్రాముఖ్యతను సూచిస్తాయి, ఈ చిత్రం ప్రభావం చూపిందని.. ఈ పరీక్షలు నిర్వహిస్తున్న అధికారుల దృష్టిని ఆకర్షించిందని స్పష్టంగా తెలుస్తుంది.
ఇదే విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు యెల్దండి తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో పంచుకున్నారు.
Question related to movie BALAGAM in group 4 exams held today🙏🙏
feeling very happy 🤗🤗#balagam @DilRajuProdctns @PriyadarshiPN @KavyaKalyanram @LyricsShyam @vamsikaka pic.twitter.com/cbaxFB3tx0— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) July 1, 2023
-గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని పరీక్ష మిస్
హైదరాబాద్ చౌటుప్పల్‌లోని కృష్ణవేణి పాఠశాల సెంటర్ కోసం గూగుల్‌లో లొకేషన్ సెర్చ్ చేసుకొని పరీక్ష రాసేందుకు వచ్చిన గ్రూప్ 4 అభ్యర్థికి చివరికి నిరాశే మిగిలింది. మ్యాప్ చూపించిన లొకేషన్‌కు చేరుకోగా అది సరైన అడ్రస్ కాదని, తప్పు అడ్రస్ అని తేలింది. ఆఖరి నిముషంలో ఎట్టకేలకు ఆగమేఘాల మీద సరైన చిరునామాకు వెళ్లగా.. నిమిషం ఆలస్యమై పరీక్షను జస్ట్ మిస్ అయ్యారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపంతో సికింద్రాబాద్ మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ఇందులో ఉన్నటువంటి గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి కొందరు.. అదే ట్రైన్లో టెన్షన్ వాతావరణంలో మరికొందరు సమీప పరీక్ష కేంద్రాలకు తరలివెళ్లారు.