KCR: ఉమ్మడి ఏపీ విడిపోయి తెలంగాణ ఏర్పాడ్డాక జరిగిన ఎన్నికల్లో కేవలం 62 సీట్లు మాత్రమే సాధించి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 2 ఎమ్మెల్యే సీట్లే రావడంతో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి నేతలను లాగి మంత్రి పదవులు ఇచ్చి రాజకీయ సుస్తిరత చేశారు. అనంతరం అభివృద్ధి చేశారు.

కేసీఆర్ చేసిన అభివృద్ధియే తెలంగాణలో రెండోసారి అఖండ మెజార్టీతో గెలిచేలా చేసింది. ఏకంగా 80కి పైగా సీట్లు సాధించి క్లీన్ స్వీప్ గా గెలిచేలా చేసింది. అయితే ముచ్చటగా మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం అసాధ్యమని.. ఈసారి ఓడిపోతాడన్న ప్రచారం అందరిలోనూ ఉంది.
ఈ క్రమంలోనే ఈరోజు మీడియా సమావేశంలో ‘ముందస్తు ఎన్నికలకు ’ వెళుతున్నారట అని కేసీఆర్ ను మీడియా మిత్రులు ప్రశ్నించారు. దానికి కేసీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాడు తెలంగాణలో మిగిలిపోయిన పనులు, అభివృద్ధి కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచి పనులు చేశానని.. ప్రతిసారి ఆ ప్లాన్ వర్కవుట్ కాదని.. ముందస్తు వెళ్లనని.. ఈసారి పూర్తి కాలం అధికారంలో ఉంటానని చెప్పుకొచ్చారు.
ఇక తాను చేసిన సర్వేల ప్రకారం.. వచ్చేసారి టీఆర్ఎస్ కు 95-105 మధ్య సీట్లు వస్తాయని.. ఆరు నెలల ముందే తాను టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్లు అభ్యర్థులకు ఇవ్వబోతున్నట్టు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కేంద్రబడ్జెట్ పై మాట్లాడిన కేసీఆర్ బీజేపీని తూర్పారపడుతూ ఆ పార్టీకి తెలంగాణలో అంత సీన్ లేదని కుండబద్దలు కొట్టారు.
ఇక కేసీఆర్ ఎన్నికల ముందర బ్రహ్మస్త్రం వదులుతానని.. దాంతోనే గెలుస్తానని చెప్పుకొచ్చారు. దాని ముందు కాంగ్రెస్, బీజేపీ కొట్టుకుపోతుందన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అది ‘ఉచిత వైద్యం’ అని తెలుస్తోంది. అందరికీ ఉచిత వైద్యం అందించి ఈ కరోనా కల్లోలం వేళ ప్రజలను మెప్పించి బంపర్ మెజార్టీతో గెలవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.