HomeతెలంగాణKCR Twin Towers : అప్పులు తెచ్చి కొప్పులు.. ఎందుకు ఈ భారీ హంగులు?

KCR Twin Towers : అప్పులు తెచ్చి కొప్పులు.. ఎందుకు ఈ భారీ హంగులు?

KCR Twin Towers : మొన్ననే కదా కొత్త సచివాలయం నిర్మించింది. వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ అంతలోనే ప్రభుత్వం మరో జంట టవర్ల నిర్మాణానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఇంతకీ ప్రభుత్వంలోని 32 శాఖాధిపతులకు కార్యాలయాలు లేవా? ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఈ ప్రయోజనాలు ఆశించి వందల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది? అసలు “పరిపాలన, సౌకర్యం, వేగవంతం” పేరిట భారీ భవనాలను నిర్మిస్తే అభివృద్ధి అంటారా? అన్నది కేసీఆర్ ఆలోచించుకోవాలి.

సౌకర్యాలు లేవు

కొత్త సచివాలయం నిర్మించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. వాస్తు పేరుతో దాన్ని నేలమట్టం చేశామని మాత్రం చెప్పడం లేదు.. ఇంతటితో సర్కారు “భారీ” నిర్మాణాలను ఆపడం లేదు. పైగా వేల కోట్లతో కొత్త కొత్త భవనాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అన్నిట్లో భారీతనాన్ని చెబుతున్నామని చెబుతున్న ప్రభుత్వం.. భావిభారత పౌరులను తయారుచేసే పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సరైన భవనాలు నిర్మించడం లేదు. భవనాలుంటే సౌకర్యాలు కల్పించడం లేదు.. విద్యార్థులు వానకు తడుస్తూ, చలికి వణుకుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చలించడం లేదు. పాములు, తేళ్లు విద్యార్థుల గదుల్లోకి చేరి.. వారిని కాటు వేసిన ఘటనలూ చోటు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో విద్య, సంక్షేమం సరైన వసతులు లేని కారణంగా ఇంత దయనీయంగా ఉంటే ప్రభుత్వం వీటిపై దృష్టి సారించడం లేదు. పైగా అధికారుల కోసం భవనాల వెంట భవనాలు నిర్మిస్తామని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న భవనాలు మరెన్నో ఏళ్లపాటు మన్నిక కలిగినవే అయినా.. ‘పరిపాలన- సౌకర్యం- వేగవంతం’ పేరుతో కొత్త భవనాలకు నిర్మాణానికి పూనుకుంటోంది. దీంతో సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదు.

సచివాలయం పేరుతో..

ఇప్పటికే కొత్త సచివాలయం పేరుతో ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ ట్విన్‌ టవర్లను ప్రకటించడంతో ఇప్పటికిప్పుడు హెచ్‌వోడీలకు ప్రత్యేక కార్యాలయాల అవసరం ఎందుకు వచ్చిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హెచ్‌వోడీలు విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలు చాలావరకు విశాలంగా ఉండడంతోపాటు సౌకర్యవంతంగానూ ఉన్నాయి. పైగా ఆ భవనాలన్నీ మరో 30 ఏండ్లకు పైగా మన్నికగలవిగా ఉన్నాయి. అయినా వాటిని కాదని ట్విన్‌ టవర్లు ఎందుకంటూ సామాన్య జనం చర్చించుకుంటున్నారు. కొత్త సచివాలయంలో తరచుగా పని ఉండే క్రమంలో ఆయా శాఖల హెచ్‌వోడీలు సెక్రటేరియట్‌కు రావాల్సి ఉంటుందని, అందుకోసం హెచ్‌వోడీ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ట్విన్‌ టవర్లు నిర్మించాలని కేసీఆర్‌ అధికారులతో అన్న విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఉన్న కొత్త సచివాలయం చుట్టూ అన్ని శాఖల అధికారుల కార్యాలయాలే ఉన్నాయి. సచివాలయానికి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం, మరోవైపు సీఐడీ, ఇంకోవైపు ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ, ఖైరతాబాద్‌లో ట్రాన్స్‌కో, జెన్‌కో కార్యాలయాలు ఉన్నాయి. ఇక ఉన్నత విద్యాశాఖ, సమాచార పౌరసంబంధాల శాఖ, పశుసంవర్థకశాఖ, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయాలన్నీ మాసబ్‌ట్యాంక్‌, శాంతినగర్‌ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మిగతా శాఖల కార్యాలయాలు కూడా కొద్దిదూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న శాఖా కార్యాలయాల నుంచి సెక్రటేరియట్‌కు చేరుకోవడానికి హెచ్‌వోడీలకు పెద్దగా సమయమేమీ పట్టదు. అయినా అన్ని శాఖల హెచ్‌వోడీలను ఒకే చోటకి చేర్చాలని సర్కారు నిర్ణయించింది. కానీ, అలా చేర్చితే.. సంబంధిత శాఖలోని క్షేత్రస్థాయి అంశాలను ఎవరు పరిశీలించాలన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఎన్నో భవనాలున్నాయి

వాస్తవానికి శాఖ విబాగాధిపతి అంటే సదరు శాఖలోని పథకాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా? లేదా? వాటి అమలు ఎలా ఉంది? అనే అంశాలపై నిత్యం క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తారు. అంతే తప్ప వారు నిత్యం సెక్రటేరియట్‌కు రావాల్సిన పని ఉండదు. ఒకవేళ హెచ్‌వోడీలను సెక్రటేరియట్‌కు దగ్గరగా ఉంచాలనుకుంటే నిన్నమొన్నటి వరకు తాత్కాలిక సెక్రటేరియట్‌గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్‌ను వినియోగించుకోవచ్చు. ఇదే కాకుండా మరెన్నో కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి కొద్దికాలానికే ఏపీ కార్యాలయాలన్నీ ఆంధ్రాకు తరల్లిపోయాయి. దీంతో ఏపీ కార్యాలయాలుగా వినియోగించిన బిల్డింగులు కూడా తెలంగాణకే దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కార్యాలయాల్లోనే కొన్ని అంతస్తులు, బిల్డింగులు ఖాళీగా ఉంటున్నాయి. బీఆర్‌కే భవన్‌తోపాటు మానవ హక్కుల కమిషన్‌ భవనం, గృహకల్ప పూర్తిస్థాయి అధికారులు లేక అరకొరగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇటీవల నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోనూ ఇప్పటివరకు అన్ని అంతస్తులు పూర్తిగా నిండలేదు.

రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌..

ట్విన్‌ టవర్లు ఒక్కొక్కటి 4 లక్షల చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని, రెండు టవర్లు సుమారు 8 – 10 లక్షల చదరపు అడుగుల్లో ఉండేలా నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటి నిర్మాణానికి రూ.1000 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి తెలిపినట్టు సమాచారం. ప్రస్తుత సచివాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీల కోసం ఏర్పాటుచేసిన కార్యాలయాలన్నీ ఇరుకు గా ఉండడంతో పాటు సౌకర్యవంతంగాలేవని ఉన్నతాధికారులే గుసగుగసలాడుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సెక్రటేరియట్‌లో కేటాయించిన చాంబర్‌ సౌకర్యవంతంగా లేని కారణంగా వారంలో 4 రోజులుపాటు వెంగళరావు నగర్‌లోని డ్రగ్‌ కంట్రోల్‌ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమ స్య ఈ ఒక్క అధికారిది మాత్రమే కాదని తెలుస్తోంది.

ట్రాఫిక్‌ జంజాటం

అసలు ఈ ట్విన్‌ టవర్ల అంశం 2015-16 నుంచే మొదలైంది. ‘స్కై టవర్స్‌’ పేరుతో ఐటీ, పరిశ్రమలు సంబంధిత కార్యాలయాల కోసం వీటిని నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందుకోసం జలవిహార్‌, సంజీవయ్య పార్కు, నెక్లెస్‌ రోడ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు. కానీ, పర్యావరణ అనుమతులు, హుస్సేన్‌సాగర్‌ దెబ్బతింటుందనే కారణాలతో ఆ నిర్ణయం నిలిచిపోయింది. పైగా ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రమవుతుంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు పోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular