TDP Janasena : టిడిపి, జనసేన పొత్తు గందరగోళం

ఏకకాలంలో నాదెండ్ల మనోహర్ అటు, ఆలపాటి రాజా ఇటు ఉండడంతో.. ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి.

Written By: Dharma, Updated On : January 8, 2024 9:32 am

TDP Janasena Alliance

Follow us on

TDP Janasena : రాష్ట్రంలో రాజకీయాల శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసిపి రాష్ట్రవ్యాప్తంగా 82 మంది అభ్యర్థులను మార్చుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే 38 మంది అభ్యర్థులను మార్చింది. అటు టిడిపి, జనసేన మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు. బిజెపి విషయంలో స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. అయితే పొత్తు విషయంలో టిడిపి, జనసేన నాయకత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణులు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి.

తెనాలి రెండు పార్టీలకు కీలక స్థానం. ఇక్కడ టిడిపి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా, జనసేన నుంచి కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఎవరికి వారే తమకు టిక్కెట్ లభిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. తమ పార్టీకే సీటు వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. దీంతో ఇక్కడ రెండు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది. కలిసి పని చేయలేకపోతున్నారు. మొన్న ఆ మధ్యన సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరు నేతలు కలిసిపోయినట్టు కనిపించారు. కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా ఉంది.

జనసేన నేత నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను, కార్యకర్తలను జనసేనలో చేర్చుతున్నారు. అదే సమయంలో ఆలపాటి రాజా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే వస్తుందని.. పోటీ చేయబోతున్నానని చెప్పుకొస్తున్నారు. ఏకకాలంలో నాదెండ్ల మనోహర్ అటు, ఆలపాటి రాజా ఇటు ఉండడంతో.. ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి.ఈ పరిస్థితి చూస్తుంటే రెండు పార్టీల మధ్య పొత్తు.. సత్ఫలితాలను ఇస్తుందా? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.