Nara Lokesh: ఆందోళనలో టీడీపీ. నారా లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమా?

వాస్తవానికి ఈ కేసులో ఈనెల 4వ తేదీన లోకేష్ విచారణకు హాజరు కావలసి ఉంది. కానీ నోటీసులో ఇచ్చిన అంశాలపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Written By: Dharma, Updated On : October 10, 2023 10:59 am

Nara Lokesh

Follow us on

Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. గత 30 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. అటు ఏసీబీ, ఇటు హైకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. ఈ తరుణంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికీ ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు 41a కింద నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ వెళ్లి మరి లోకేష్ కు నోటీసులు అందించారు.

వాస్తవానికి ఈ కేసులో ఈనెల 4వ తేదీన లోకేష్ విచారణకు హాజరు కావలసి ఉంది. కానీ నోటీసులో ఇచ్చిన అంశాలపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను డైరెక్టర్ గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అకౌంట్లను సైతం విచారణ సమయంలో సమర్పించాలని సిఐడి అధికారులు ఆదేశించడాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 12 వరకు లోకేష్ ను అరెస్టు చేయవద్దని ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 10వ తేదీన లోకేష్ ను విచారించాలని సూచించింది. ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి లోకేష్ విజయవాడ చేరుకున్నారు.

మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి పొంగూరు నారాయణకు సిఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసింది. నారాయణ భార్య రమాదేవి, ఆమె బంధువు రాపూరి సాంబశివరావు, నారాయణ కాలేజీ ఉద్యోగి ధనుంజయ్ భార్య ప్రమీల, నారాయణ బంధువు ఆవులు శ్రీనివాస్ పేర్లను చేరుస్తూ సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసునకు సంబంధించి పూర్తి ఆధారాలతో సిఐడి పిటిషన్లు దాఖలు చేయడం విశేషం. ఇదంతా కేసులో పట్టు బిగించడానికేనని టాక్ నడుస్తోంది.

చంద్రబాబు అరెస్టు తరువాత లోకేష్ ఢిల్లీలో ఎక్కువ రోజులు గడిపారు. అరెస్టులకు భయపడే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ వేసిన నేపథ్యంలో న్యాయ కోవిదులతో చర్చించడానికేలోకేష్ ఢిల్లీ వెళ్ళినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.ఈనెల 12 వరకు లోకేష్ ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో.. ఈరోజు జరిగే విచారణకు ఆయన హాజరుకానున్నారు. అదే సమయంలో చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఈరోజే వెల్లడించే అవకాశం ఉంది. అటు చంద్రబాబు కేసులో తీర్పు, ఇటు నారా లోకేష్ సిఐడి విచారణ ఇదే రోజు జరుగుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.