T20 World Cup: ప్రపంచకప్ లో గ్రూప్1 సెమీస్ రేసు తేలిపోయింది. నిన్న జరిగిన రెండు మ్యాచ్ లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరాయి. వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించిన ఆస్ల్రేలియా సగర్వంగా సెమీస్ చేరింది. ఇక చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ ను భారీ తేడాతో ఓడిస్తేనే దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ ప్రకారం సెమీస్ చేరేది. అయితే ఇంగ్లండ్ పై సౌతాఫ్రికా గెలిచినా తక్కువ తేడాతో గెలిచింది. దీంతో గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరి సౌతాఫ్రికా ఇంటిదారి పట్టింది.

ఇక గ్రూప్ 2లో సెమీస్ రేసులో ప్రస్తుతానికి 3 జట్లు పోటీపడుతున్నాయి. న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్, టీమిండియా బరిలో ఉన్నాయి. ఇందులో అందరికంటే అవకాశాలు న్యూజిలాండ్ కు ఉన్నాయి. అప్ఘనిస్తాన్ పై చివరి మ్యాచ్ గెలిస్తే చాలు న్యూజిలాండ్ రన్ రేట్ తో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. ఓడిపోతే మాత్రం నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న టీమిండియాకు మంచి ఛాన్స్ ఉంది.
అందుకే ఇప్పుడు గ్రూప్ 2లో సెమీస్ రేసులో టీమిండియా ఉండాలంటే అప్ఘనిస్తాన్ చేతిలోనే మన భవిష్యత్ ఉంది. ఆ టీం న్యూజిలాండ్ పై గెలిస్తే భారత్ కు అవకాశం ఉంటుంది. ఓడిందా.. టీమిండియా, అప్ఘనిస్తాన్ ఇంటికే.. అప్ఘనిస్తాన్ గెలిస్తే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు ఉంటాయి. రన్ రేట్ బాగుంటే వెళుతుంది. దీంతో గ్రూప్ 2లోని అప్ఘన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ఇప్పుడు భారత అభిమానులు, టీం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఈరోజు 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. భారత్ లోని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఇప్పుడు అప్ఘనిస్తాన్ విజయం కోసం ప్రార్థిస్తున్నారు. అప్ఘన్ మరి ఏం చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
అయితే నాకౌట్ మ్యాచ్ లలో న్యూజిలాండ్ భారీగా పోరాడుతుంది. కడవరకూ ఢీ అంటే ఢీ అనేలా ఆ ఆటగాళ్లు ఆడుతారు. గివ్ అప్ అస్సలు ఇవ్వరు. దీంతో అప్ఘనిస్తాన్ విజయం సాధించడం కొంచెం కష్టమే. గ్రూప్ 2లో తొలి రెండు మ్యాచ్ లు పాకిస్తాన్, న్యూజిలాండ్పై భారత్ ఓడిపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.
అప్ఘానిస్తాన్ కనుక న్యూజిలాండ్ పై గెలిస్తే అప్పుడు 6 పాయింట్లతో ఆ రెండు జట్లు సమానంగా ఉంటాయి. పటిష్టమైన అప్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ను న్యూజిలాండర్స్ ఎలా ఎదుర్కొంటారన్నది ఇక్కడ కీలకం. భారత్ తన చివరి మ్యాచ్ లో నమీబియాతో భారీ రన్ రేట్ తో గెలిస్తే ఇక తిరుగుండదు. సెమీస్ చేరుతుంది. మరి అది జరుగుతుందా? లేదా ? అన్నది ఈరోజు సాయంత్రం లోపు తేలుతుంది.