T20 World Cup 2022- Indian Cricketers: “అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని”. ఈ సామెత టీం ఇండియాకు అచ్చుగుద్దినట్టు వర్తిస్తుందనుకుంటా. 360 డిగ్రీల్లో షాట్లు కొట్టే సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. షార్ట్ పిచ్ బాల్స్ తో బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టే బుమ్రా ఉన్నాడు. మంచినీళ్ల ప్రాయం లాగా శతకాలు బాదే కోహ్లీ ఉన్నాడు. హిట్ మాన్ గా పేరు గడించిన రోహిత్ శర్మ ఉన్నాడు. అయినా ఏం ఉపయోగం? 2007లో టి20 వరల్డ్ కప్ వచ్చింది. 2011లో వరల్డ్ కప్ వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ నిర్వహించిన ఏ ఒక్క మెగా టోర్నీ లోనూ టీం ఇండియా సత్తా చాట లేదు. ఆటగాళ్లు లేరా అంటే ఉన్నారు. కానీ కీలక సమయంలో చేతులు ఎత్తేస్తున్నారు.. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన సెమీస్ మ్యాచ్ లో భారత బౌలింగ్ చూశాం కదా! బహుశా గల్లి స్థాయి బౌలర్లు కూడా అలా బంతులు వేయరు కావచ్చు. మేము ఇక్కడ దాకా రావడమే గొప్ప అన్నట్టుగా భారత ఆటగాళ్ల తీరు ఉంది. ఒక వికెట్ కూడా తెలియకుండా భారత్ ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ స్వల్ప స్కోరు చేసినప్పటికీ.. దానిని కాపాడుకునేందుకు ఇంగ్లీష్ జట్టును చివరి వరకు తీసుకొచ్చింది. పోనీ పాక్ బౌలర్లు భారత బౌలర్ల కంటే గొప్పగా వేశారు అంటే అది కూడా లేదు. ఇక 2007, 2011 తర్వాత పలు టి20 వరల్డ్ కప్ లు జరిగాయి. వరల్డ్ కప్ కూడా జరిగింది. కానీ భారత జట్టు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ 11 సంవత్సరాల లో ఎంతో మంది ఆటగాళ్లు మారారు. కొత్త కొత్త కెప్టెన్ లు వచ్చారు. టీం మొత్తం మారింది. ఒకరు ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. ఎన్ని మార్పులు చేసినప్పటికీ అద్భుత విజయాలు మాత్రం దక్కడం లేదు.

లోపం ఎక్కడుంది
భారత క్రికెట్ జట్టు పూర్తిగా విఫలం అవుతుందని కాదు. 11 సంవత్సరాలుగా చెప్పుకోదగిన విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా దేశంలో ఆస్ట్రేలియా మీద రెండుసార్లు టెస్ట్ సిరీస్ లు నెగ్గింది. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలలో అనితర సాధ్యమైన టెస్టు విజయాలు సొంతం చేసుకుంది. బౌన్సీ పిచ్ లుగా పేరు పొందిన ఆ దేశాలలో టెస్ట్ విజయాలు సొంతం చేసుకోవడం అంటే మాటలు కాదు. అయితే ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్ లలో మాత్రం భారత్ తడబడుతోంది.
సెమీస్ ఓటమి రివాజు అయింది
భారత క్రికెట్ సమాఖ్య ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా వెలుగొందుతోంది. అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య కు వచ్చే ఆదాయంలో బి సి సి ఐ నుంచే సింహభాగం వెళ్తుంది. అక్కడిదాకా ఎందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సమకూరే యాభై శాతం ఆదాయం భారత్ వల్లే అంటే అతిశయోక్తి కాదు.. దీనికి తోడు భారతదేశంలో యువకుల సంఖ్య ఎక్కువ. రంజి క్రికెట్ టోర్నీలు ఏడాది మొత్తం కొనసాగుతూనే ఉంటాయి. దీనికి అదనంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో భారత క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నారు. దేశవాళి ఆటగాళ్లు కూడా అంతర్జాతీయ క్రీడాకారులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటున్నారు. కలిసి మైదానంలోకి దిగుతున్నారు. బోలెడంత అనుభవాన్ని సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వారికి జాతీయ జట్టులో కూడా వేగంగానే చోటు దక్కుతున్నది.

విజయాలు ఎందుకు దక్కడం లేదు
భారత క్రికెట్ సమాఖ్య దేశవాళి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న తీరును విదేశీ క్రికెటర్లు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. దీనివల్ల దేశంలో క్రికెట్ మరింతగా అభివృద్ధి చెందుతుందని వారు అంటూ ఉంటారు. ఇలా ఎన్ని మెచ్చుకోళ్లు వచ్చినప్పటికీ అంతిమంగా విజయాలు మాత్రం దక్కడం లేదు. భారత జట్టుకు ఉన్న వనరుల ప్రకారం గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రపంచ కప్ లు అన్నింటిని ఈ దేశమే ఎగరేసుకు పోవాలి.. కానీ అలా జరగలేదు.. ఒక దశలో ఆశ్చర్య క్రికెట్ జట్టు ఎలా ప్రపంచ క్రికెట్ ను శాసించిందో అలాంటి ప్రదర్శన భారత జట్టు ఇవ్వాల్సి ఉండేది. 1999 తో మొదలుకొని 2010 దాకా ఆస్ట్రేలియా జట్టు అద్వితీయమైన ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ ను శాసించింది. వన్డే, టెస్ట్ ఇలా ఏ ఫార్మాట్ చూసుకున్నా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కానీ కాలక్రమేణా ఆస్ట్రేలియా ఆధిపత్యం మసక బారుతూ వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది.. సొంత దేశంలో జరిగిన టి20 మెన్స్ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆస్ట్రేలియా వదిలిన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ భారత్ దానిని ఉపయోగించుకోలేకపోతోంది. టెస్టులు, వన్డే, టి20 సిరీస్ వరకు భారత్ ప్రదర్శన బాగానే ఉంటుంది. కానీ ముందుగానే చెప్పినట్టు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ప్రపంచ కప్ ల ముందు ఢీలా పడుతున్నది. సెమిస్ ఓటమి అనంతరం టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా నియమితుడయ్యాడు. ఇలాంటి మార్పులైనా భారత్ కు ప్రపంచ కప్ లు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.