మార్స్ గ్రహం మీద జీవాన్వేషణ కోసం ఎప్పుడో మొదలైన ప్రయత్నాలు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఇటీవల నాసా పంపించిన రోవర్ ‘పెర్సెవరెన్స్’ అద్వితీయంగా తన రీసెర్చ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో కీలకమైన విషయాలకు సంబంధించిన సమాచారాన్ని అది భూమికి చేరవేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నాసా శాస్త్రవేత్తలు ప్రపంచానికి కూడా చూపిస్తున్నారు. అయితే.. అంగారక గ్రహం ఇప్పుడు ఎడారిగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ.. ఒకప్పుడు అదొక నీటి కుండం. గ్రహం మొత్తం నీటితో నిండిపోయి ఉండేది. మరి, ఇప్పుడు ఆ నీరు ఏమైందన్నదే ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రోవర్ పెర్సెవరెన్స్ వాళ్లకు అసలైన పనిముట్టుగా అందివచ్చింది. అది పంపిస్తున్న సమాచారం ద్వారా నీటి జాడను కనిపెట్టే ప్రయత్నాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
అంగారకుడి మీద ఒకప్పుడు ఉండే నీటితో.. ఆ గ్రహం మొత్తాన్ని దాదాపు కిలోమీటరు లోతు వరకు ముంచేసి కనపడకుండా చేయొచ్చట! దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. అక్కడ ఎంత నీరు ఉండేదో అని! అలాంటి గ్రహం మీద చుక్క నీరుకూడా లేకుండా ఖాళీ అయ్యింది. గడిచిన 410 కోట్ల సంవత్సరాల నుంచి 370 కోట్ల సంవత్సరాల వరకు జరిగిన ప్రక్రియలో భాగంగా.. ఈ నీరంతా కనిపించకుండా పోయిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు మార్స్ నుంచి రోవర్ అందిస్తున్న సమాచారం ప్రకారం.. ఆ నీరు ఎక్కడికి పోయిందనే విషయాన్ని తేలిగ్గా పసిగట్టేస్తామని చెబుతున్నారు నాసా సైంటిస్టులు. అయితే.. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల ప్రకారం గ్రహంపై ఉన్న నీరంతా నేలలోకి ఇంకి పోయిందని భావిస్తున్నారు. అది కూడా ఎంతో లోతునకు కాకుండా.. పై పొరల్లోనే నిక్షితప్తమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రహం పైపొర మార్పులకు లోనైనప్పుడు ఇలా జరుగుతుందని నాసా చెబుతోంది. ఆ సమయంలో భూమిలోకి వెళ్లిన నీరు అక్కడ ఉన్న ఖనిజాలలో నిక్షప్తమై ఉంటుందని వెల్లడిస్తోంది.
పెర్సెవరెన్స్ అందిస్తున్న సమాచారంలో ప్రధానంగా నీటి జాడలను కనుగొనేందుకు తాము కృషి చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్స్ మీద నీరుఎంత ఉండేది? అది ఎలా పోయింది? ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు అనే విషయాలను క్లియర్ గా అర్థం చేసుకోవడానికి తాజా పరిశోధన చాలా వరకు ఉపకరిస్తుందని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్త మైఖేల్. ఈయేనే పెర్సెవర్సన్ అన్వేషణ ప్రోగ్రామ్ కు నాయకత్వం వహిస్తున్నారు.
ఈ అధ్యయనం ద్వారా మార్స్ పైన ఉండే నీళ్లు గ్రహంలోని మట్టి, రాళ్లలో నిక్షిప్తమై ఉందని తెలుస్తోందన్నారు. ఈ తరహా ప్రక్రియ భారీగా నీటిని నిల్వ చేస్తుందని ఆయన అంటున్నారు. మార్స్ ఏర్పడిన సుమారు 150 కోట్ల సంవత్సరాల తర్వాత దానిపైన ఉన్న నీరు చాలా వరకు మాయమైందని చెప్పారు. ఆ తర్వాత ఇంకా వేగంగా నీరు భూమి పొరల్లోకి వెళ్లిపోతూ వచ్చిందని అంచనా వేస్తున్నారు.
మొత్తంగా.. అరుణ గ్రహం ఇప్పుడున్న ఎడారి లాంటి స్థితి గత వందేళ్ల నాటిదేనని చెప్పారు. ఈ క్రమంలో మార్స్ నీటి జాడల గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తామని, పెర్సెవరెన్స్ సహకారంతో ఆ వివరాల ఆనుపానులు తెలుసుకుంటామని చెబుతున్నారు మైఖేల్. కాగా.. 25 హెచ్ డీ కెమెరాలు, ఐదు క్వాలిటీ మైక్రో ఫోన్లతో రోవర్ అన్వేషణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వీడియోలు తీసి, భూమికి చేరవేస్తోంది. మరి, మార్స్ పై వాటర్ గురించిన సమాచారం త్వరలోనే తెలుస్తుందో లేదో చూద్దాం.