BYD Yangwang U8L : సాధారణంగా ‘చైనా సరుకు’ అనగానే మనలో చాలామందికి ‘నాసిరకం’ లేదా ‘కొద్దిరోజులే మన్నిక’ అనే అభిప్రాయం ఉంటుంది. కానీ, ప్రపంచంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలలో ఒకటిగా ఎదిగిన చైనాకు చెందిన బీవైడీ.. తమ సరికొత్త కారుతో చేసిన ఒక టెస్ట్ ద్వారా ఆ పాత ముద్రను చెరిపేసింది. ఈ వీడియో చూస్తే… ‘చైనా సరుకు’ అంటే ఇక ఎంత మాత్రం నాసిరకం కాదు, పవర్ ఫుల్ అని ఒప్పుకోక తప్పదు.
భారీ చెట్టు కూల్చి… కారుపై టెస్ట్!
బీవైడీ సంస్థ తమ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన యాంగ్‌వాంగ్ యూ8ఎల్ (Yangwang U8L) యొక్క పటిష్టతను పరీక్షించడానికి ఎవరూ ఊహించని వినూత్న పద్ధతిని ఎంచుకుంది. దాదాపు 141 అడుగుల పొడవైన, భారీ పామ్ చెట్టును ఒక ప్రత్యేకమైన యంత్రాంగం సహాయంతో కారుపైకి నేరుగా కూల్చారు. మూడు సార్లు పడేసినా…: ఈ షాకింగ్ టెస్ట్‌ను ఒకసారి కాదు, పెరుగుతున్న బలంతో మూడుసార్లు నిర్వహించారు. చివరి టెస్ట్‌లో గరిష్టంగా 50.4 కిలోజౌల్స్ శక్తితో కూడిన బలం కారుపై పడింది.
ఇంత భారీ బలం పడినప్పటికీ, కారు బాడీ ఏమాత్రం కనీసం సొట్ట కూడా పడకుండా, పటిష్టంగా నిలబడింది. కారు అద్దాలు పగలకుండా, డోర్లు యథావిధిగా తెరుచుకునే విధంగా ఉండడం ఇంజనీర్ల పనితీరుకు నిదర్శనం. టెస్ట్ పూర్తయిన తర్వాత కారు సజావుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడం ఈ వీడియోలో హైలైట్!
‘సెక్యూరిటీ’లో సరికొత్త బెంచ్‌మార్క్
ప్రమాదాల సమయంలో ప్రయాణీకుల భద్రత ఎంత ముఖ్యమో ఈ టెస్ట్ నిరూపించింది. కారు పైకప్పు, పిల్లర్లు ఎంత బలంగా ఉంటే, ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉన్నవారికి ప్రాణాపాయం అంత తక్కువగా ఉంటుంది.
బీవైడీ యాంగ్‌వాంగ్ యూ8ఎల్ ఇప్పటికే క్రాబ్ వాక్ (పక్కకు నడవడం), నీటిపై తేలడం , ట్యాంక్ టర్న్ వంటి అధునాతన ఫీచర్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ చెట్టు టెస్ట్‌తో భద్రత విషయంలో కూడా తాము ఏ స్థాయికి చేరుకున్నామో చూపించింది.
చైనా కంపెనీలు నాసిరకం సరుకులను తయారు చేస్తాయన్న పాత అభిప్రాయాన్ని ఈ వీడియో పూర్తిగా మార్చేసింది. గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్‌లో బీవైడీ కేవలం సాంకేతికతలోనే కాదు, నాణ్యత విషయంలోనూ అగ్రస్థానంలో నిలుస్తోందని ఈ అసాధారణ టెస్ట్ తేటతెల్లం చేసింది.
BYD Durability Test – Mind Blocking!pic.twitter.com/e8NblpZ1Hm
— yalavarthi (@yskanth) December 2, 2025