Dravidian Languages : భారతదేశ ఉపఖండంలో ప్రధానంగా రెండు పెద్ద భాషా కుటుంబాలు ఉన్నాయి. అవి ఉత్తర భారతదేశంలో ఆధిపత్యం వహించే ఇండో-ఆర్యన్ భాషలు.. దక్షిణాన పాతుకుపోయిన ద్రవిడ భాషలు. ఈ రెండు కుటుంబాలు తమదైన లిపి, పదజాలం , వ్యాకరణ నిర్మాణంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
ద్రవిడ భాషా కుటుంబం: ఒక ప్రత్యేక ప్రపంచం
మన దక్షిణ భారతదేశంలో మాట్లాడే తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం వంటి భాషలు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవి. ఇవి కాకుండా తులూ, కొడగ, గదబ, ఒల్లారి, కుయి, కువి వంటి అనేక ఉప-భాషలు కూడా ఈ కుటుంబంలో భాగమే. ఈ భాషలన్నిటికీ ఉత్తర భారతదేశంలోని ఇండో-ఆర్యన్ భాషలతో ప్రత్యక్ష సంబంధం లేదు, ఇవి తమదైన ప్రత్యేకమైన మూలాన్ని, ఉనికిని కలిగి ఉన్నాయి. ఈ భాషలన్నిటికీ ఉమ్మడిగా ఒక మూల ద్రావిడ భాష ఉండేదని భాషాశాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ మూల భాషకు దగ్గరగా ఉండే రూపం నేటి తమిళంలో కనిపిస్తుంది. భాషా శాస్త్రవేత్తల అంచనా ప్రకారం తమిళం నుండి మొదట తెలుగు వేరుపడింది. ఆ తర్వాత కన్నడం మరియు మళయాలం కూడా వేర్వేరు భాషలుగా పరిణామం చెందాయి.

ఈ “దూరం జరగడం” అంటే భాషలు ఇతర సంస్కృతులు, భాషలతో సంపర్కం పొంది, క్రమంగా మార్పులకు లోనై ప్రత్యేక భాషగా ఏర్పడటం. ఈ ప్రత్యేకతను మొట్టమొదటగా గుర్తించింది బిషప్ కాల్డ్వెల్. మన తెలుగు భాష ద్రవిడ భాష అని సమగ్రమైన ఆధారాలతో సహా నిరూపించిన ఘనత ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి గారికి దక్కుతుంది.
బ్రాహ్వీ చిక్కు: ద్రవిడ భాషల రహస్య వలస
ద్రవిడ భాషా కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భాషలన్నీ దాదాపు దక్షిణ , మధ్య భారతదేశంలో కేంద్రీకృతమై ఉంటే, ఒక్క బ్రాహ్వీ భాష మాత్రం ప్రస్తుత పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో (బలూచిస్తాన్‌లో) మాట్లాడబడుతోంది. దక్షిణాది భాషకు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భాషకు సంబంధం ఎలా ఏర్పడిందనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ చిక్కుముడిని విప్పడానికి అనేక పరిశోధనలు జరిగాయి.

ఎడ్విన్ నోరిస్ (1853): ఈ భాషాశాస్త్రవేత్త పాకిస్తాన్‌లోని బ్రాహ్వీ భాషకు, ఒకప్పుడు ఇరాన్ దక్షిణ భాగంలో వెలుగొందిన ఎలుమ్ నాగరికత ప్రజలు మాట్లాడిన ఎలమైట్ భాషకు మధ్య సంబంధం ఉందని ప్రతిపాదించారు.
బిషప్ కాల్డ్వెల్: ఈ ప్రతిపాదనకు తగిన ఆధారాలను అందించారు.
డేవిడ్ మెక్కాల్పిన్ (1975): ఈయన తన పరిశోధనలో మరిన్ని వివరాలతో, ఉదాహరణలతో ఎలమైట్-ద్రావిడ భాషా కుటుంబ సంబంధాన్ని బలంగా నిరూపించారు.
ఈ పరిశోధనల సారాంశం ఏమిటంటే మొదట ఈ ద్రావిడ-ఎలమైట్ భాష మాట్లాడే ప్రజలు ఇరాన్ ప్రాంతం నుండి వచ్చి భారత ఉపఖండంలోని వాయువ్య భాగంలో స్థిరపడ్డారు. వీరే సింధూ నది పరివాహక ప్రాంతంలో వెలసిన సింధూ నాగరికత ప్రజలై ఉండవచ్చని ఒక ప్రధాన సిద్ధాంతం. తరువాత ఆర్యుల రాక వల్ల, ఈ ప్రజలు బలవంతంగా ముందుకు నెట్టబడ్డారు.
వారిలో కొందరు తూర్పు వైపు వెళ్లగా, అధిక సంఖ్యాకులు దక్షిణాది వైపు వలస పోయి చివరికి సముద్రం అడ్డు రావడంతో స్థిరపడ్డారు. కాలక్రమేణా గంగా-యమునా పరివాహకంలో ఆర్యులు స్థిరపడ్డాక, దక్షిణాది నుండి పెరిగిన ద్రావిడ జనాభా ప్రస్తుత ఆంధ్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాలకు విస్తరించింది. ఈ విధంగా ద్రవిడ భాషా కుటుంబం యొక్క మూలాలు ఆఫ్రికా నుండి మధ్య ఆసియా మీదుగా వాయువ్య భారతంలోకి, చివరకు దక్షిణ భారతదేశంలోకి జరిగిన సుదీర్ఘ మానవ వలస కథను చెబుతున్నాయి.
కీలకడి: ఆధునిక పరిశోధనల మద్దతు
ఇటీవల తమిళనాడులోని కీలడి ప్రాంతంలో బయటపడిన పురాతన నాగరికతా అవశేషాలు, సింధూ నాగరికతను పోలిన లక్షణాలను కలిగి ఉండటం ఈ సిద్ధాంతాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
కీలడి తవ్వకాలు దక్షిణాది నాగరికత కూడా వేల సంవత్సరాల నాటిదనీ, ఇది ఉత్తరాది సింధూ నాగరికతతో ఏదో ఒక స్థాయిలో సంబంధం కలిగి ఉండేదనీ సూచిస్తున్నాయి. ఈ చారిత్రక, భాషా నేపథ్యాలు, మనం ‘దేశం’, ‘భాష’, ‘జాతి’ వంటి సరిహద్దులను పరస్పర విద్వేషానికి వాడుకోకుండా, మనమంతా చారిత్రక వలసల, సాంస్కృతిక సమ్మేళనాల ఫలితమేనని తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి.
– Siddharthi Subhas Chandrabose