
పెళ్లిళ్లు చేసుకుందామనుకునే వారికి షాకింగ్ న్యూస్. అప్పుడు కరోనా వచ్చి పెళ్లిళ్లు చేసుకునేందుకు దూరం చేస్తే.. ఇప్పుడు ముహూర్తాలు అయిపోయి మరికొద్ది నెలల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2020 కరోనాతో ఇప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢమిలతో పెళ్లి ముహూర్తాలకు బ్రేక్ పడింది. ఈఏడాది పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయని పండితులు తేల్చి చెబుతున్నారు.
గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు అడ్డంకి అవుతోందని.. దీంతో శుక్రవారం వరకే పెళ్లి ముహూర్తాలు ముగిశాయని, ఇక ఈ ఏడాది మే నెల వరకూ మంచి రోజులు లేవని పంతుళ్లు స్పష్టం చేశారు.
ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభం కాబోతోంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ ఉంటుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు ఉండవు. సుమారు నెలరోజులపాటు గురుమౌఢ్యమి ఉంటుందని పండితులు చెప్పారు. ఇక ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఉంటుందని చెప్పారు.
ఆ తర్వాత శుభదినాలు ప్రారంభమైనా.. 10 రోజులపాటు బలమైన ముహూర్తాలు లేవంట. మే 14 తర్వాత నుంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజులు మాత్రమే. జూలై 4 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలోనూ పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదని చెబుతున్నారు.
పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు అటు తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. అసలే గతేడాదంతా కరోనాతో శుభకార్యాలు తక్కువగా జరిగాయి. ఈ ఏడాదైనా కాస్త వెసులు బాటు వస్తుందని భావిస్తే ముహూర్తాలు దెబ్బతీశాయని అంటున్నారు. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, అర్చకులు, పూలు, పండ్ల వ్యాపారులకు కూడా ఇది పెద్ద దెబ్బే.