Telangana Cabinet : అన్నట్టే ‘రేవంత్ ‘తెలంగానం’.. అస్థిత్వానికి ప్రాధాన్యం

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి మంత్రివర్గంలో ఆమోదం తెలిపామన్నారు.

Written By: Raj Shekar, Updated On : February 5, 2024 9:57 am
Follow us on

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్‌ భేటీ ఆదివారం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశంలోనే మరో రెండు గ్యారంటీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

టీఎస్‌ స్థానంలో టీజీ..
ఇక వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న టీఎస్‌ కోడ్‌ స్థానంలో ఇక నుంచి టీజీ అమలు చేయాలని కేబినెట్‌లో తీర్మానం చేశారు. ఇకపై జరిగే వాహన రిజిస్ట్రేషన్లన్నీ టీజీతోనే జరగాలని నిర్ణయించింది. ఈమేరకు జీవో జారీ చేసే అవకాశం ఉంది. మరో కీలక నిర్ణయం.. తెలంగాణ గీతం.. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

బీసీ కులగణనకు పచ్చ జెండా..
ఇక లోక్‌సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీసీ కులగణన చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌ ప్రకటించారు. ఈమేరకు మంత్రులు కూడా పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపారు. మరో కీలక నిర్ణయం గతంలో విడుదలైన గ్రూప్‌–1 పోస్టులకు మరో 160 పోస్టులు కలుపుతు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు.

ఇవీ కూడా..
– కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ, హైకోర్టుకు వంద ఎకరాల స్థలం, 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కేబినెట్‌లో తీర్మానించారు.

– తెలంగాణలో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు, క్షమాభిక్ష ప్రసాదించేందుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణపైనా కేబినెట్‌ భేటీలో చర్చించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి మంత్రివర్గంలో ఆమోదం తెలిపామన్నారు.