Chandrababu – CID : రూ.4400 కోట్ల స్కామ్.. చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్.. అరెస్టుకు రెడీ?

మొత్తానికి అసైన్డ్ భూముల కుంభకోణం చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందని.. ఎన్నికలవేళ ఇది ఆ పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసులో కూడా ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : March 11, 2024 7:25 pm
Follow us on

Chandrababu – CID : ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి సిఐడి అధికారులు బాంబు పేల్చారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై కేసు పెట్టారు. అది కూడా ఎన్నికలకు ముందు.. చంద్రబాబు నాయుడు హయాంలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని, దాని విలువ 4400 కోట్లని, ఇందులో అప్పటి మంత్రి నారాయణ కూడా ప్రమేయం ఉందని ఏపీ సిఐడి అభియోగాలు మోపింది.. రికార్డులు టాంపరింగ్ చేసి భూములు ఆక్రమించారని ఆరోపించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబునాయుడుని, రెండవ నిందితుడిగా నారాయణను పేర్కొన్నది. దీంతో ఒక్కసారిగా ఏపీలో సంచలనం చోటుచేసుకుంది.

గత ఏడాది స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. చార్జ్ షీట్ దాఖలు చేసి విచారణ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. చాలా రోజులపాటు చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి విచారణ సాగుతోంది. అప్పట్లో తనకు ఆరోగ్యం బాగాలేదని చంద్రబాబు నాయుడు కోర్టుకు విన్నవించుకోవడంతో బెయిల్ మంజూరు చేసిందనే వార్తలు వినిపించాయి. బెయిల్ ద్వారా బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వివిధ పుణ్యక్షేత్రాలకు సతి సమేతంగా వెళ్లారు. ప్రస్తుతం బిజెపితో పొత్తులకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఇవి ఇలా ఉండగానే ఏపీ సిఐడి ఆకస్మాత్తుగా అసైన్డ్ భూముల కుంభకోణాన్ని తెరపైకి తీసుకువచ్చింది. వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రయిన నాటి నుంచి అసైన్డ్ భూముల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతామని పలు సందర్భాల్లో చెప్పారు. అలా చెప్పినట్టుగానే సోమవారం ఏపీ సిఐడి ఈ కేసును తెరపైకి తీసుకురావడం విశేషం.

ఇప్పటికిప్పుడు అసైన్డ్ భూముల కుంభకోణాన్ని ఏపీ సిఐడి తెరపైకి తీసుకురావడం పట్ల టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. వైసిపి శ్రేణులు స్వాగతం పలుకుతున్నాయి. అప్పట్లో అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేసి.. తనకు అనుకూలమైన వారికి చంద్రబాబు అడ్డగోలుగా భూములు కేటాయించారని.. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని ఏపీ సిఐడి ఆరోపిస్తోంది. మరోవైపు భూములకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఉంటే ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఏం చేసిందని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఎన్ని రకాల కుయుక్తులకు పాల్పడినా అంతిమంగా తమ పార్టీ గెలుస్తుందని టిడిపి నాయకులంటున్నారు. ప్రభుత్వ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. ఆ ఆధారాలతోనే సిఐడి కేసులు నమోదు చేసిందని వైసిపి శ్రేణులు చెబుతున్నారు. మొత్తానికి అసైన్డ్ భూముల కుంభకోణం చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందని.. ఎన్నికలవేళ ఇది ఆ పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసులో కూడా ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.