Rohit vs Kohli : టీమిండియాకు జట్టుగా అభిమానులు ఉన్నట్లుగానే, జట్టులోని ఆటగాళ్లకు కూడా విడివిడిగా అభిమానులు ఉన్నారు. ఇక స్టార్ ఆటగాళ్లు కోహ్లి, రోహిత్, ధోని, సూర్య, గిల్‌కు అయితే డైహార్ట్ ఫ్యాన్స్. తమ హీరోను ఎవరు ఏమన్నా ఊరుకోరు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా ఇప్పుడు అదే జరిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులు రెండుగా విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇద్దరు ఆటగాళ్లూ దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ(15)ను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేర్చగా.. విరాట్ కోహ్లిని మిచెల్ స్టార్క్ నాలుగో వికెట్‌గా ఔట్ చేశాడు.
రోహిత్‌ను ట్రోల్ చేసిన కోహ్లి ఫ్యాన్స్
రోహిత్ శర్మ ఔటైన వెంటనే కొందరు అభిమానులు అతనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగారు. వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని, కీలక మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఆడింది లేదని విమర్శించారు. గణంకాలతో సహా ట్వీట్ చేశారు. కోహ్లి సారథ్యంలో భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి కూడా రోహిత్ శర్మనే ప్రధాన కారణమని విమర్శించారు. 2017 డబ్ల్యూటీసీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి ఓపెనర్‌గా రోహిత్‌శర్మ వైఫల్యమే కారణమని గుర్తు చేశారు.
రంగంలోకి రోహిత్ ఫ్యాన్స్…
ట్రోలింగ్ చూసిన రోహిత్ అభిమానులు విరాట్ ఆడుతున్నంతసేపు మౌనంగా ఉన్నారు. కోహ్లీ ఔటైన వెంటనే వాళ్లు సోషల్ మీడియా వేదికగా రంగంలోకి దిగారు. చోక్లీ అంటూ అతనిపై విమర్శలు గుప్పించారు. రోహిత్ కంటే కోహ్లీనే ఫ్రాడ్ అని, కీలక మ్యాచ్‌ల్లో అతను విఫలమయ్యాడని, లైఫ్ లభిస్తేనే ఆడతాడని, అఫ్గానిస్థాన్ వంటి చిన్న దేశాలపై మాత్రమే సెంచరీలు చేస్తాడని మండిపడ్డారు. రోహిత్ శర్మను విమర్శించే ముందు కోహ్లి గణంకాలు పరిశీలించాలని ట్రోల్ చేశారు. ఐపీఎల్‌లో తప్ప కోహ్లి ఎక్కడా ఆడాడని విమర్శలు గుప్పించారు.
ట్రోలింగ్‌ఫై జట్టు ఫ్యాన్ ఆగ్రహం..
రోహిత్, కోహ్లి అభిమానుల ట్రోలింగ్‌పై తటస్థ అభిమానులు, టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన స్టార్ ఆటగాళ్లను మనమే తిట్టుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇది ఏ మాత్రం భావ్యం కాదని సూచిస్తున్నారు.
టీమిండియా ఎదురీత..
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఎదురీదుతోంది. భారీ స్కోర్‌ను అధిగమించే లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(15), శుభ్‌మన్ గిల్‌ను త్వరగా పెవిలియన్ చేర్చిన ఆసీస్.. ఆ తర్వాత పుజారా(14), విరాట్ కోహ్లీ(14)లను కూడా ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించింది. నలుగురు బౌలర్లు తలో వికెట్ తీయడంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.