Revanth Reddy : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు హస్తం కండువా కప్పుకుంటుండడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త బలం చేకూర్చుతోంది. అయితే గత ఎన్నికల్లో, అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆవేశంతో వ్యవహరించింది. దీనికి తగ్గ ఫలితాన్ని చెల్లించుకుంది. కాంగ్రెస్ వీక్ పాయింట్ కనిపెట్టిన కేసీఆర్ దానిమీద వరుస దెబ్బలు కొట్టాడు. ఫలితంగా ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయిపోయింది. ఖమ్మంలో ఆంటీ జిల్లాల్లో సుమారు 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారిని కాపాడుకోలేకపోయింది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అంతకంతకు ఎదుగుతుండడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీకి కొత్త బలం వచ్చింది.
రేవంత్ దూకుడు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అనంతరం తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. గతంలో మాదిరి ఆవేశంతో పనిచేయకుండా ఆలోచనతో పనిచేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. దీనివల్ల వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని రేవంత్ రెడ్డి విశ్వసిస్తున్నారు. దామోదర్ రెడ్డి ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మామూలు విషయం కాదు. సీనియర్లు ఇబ్బంది పెడుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి తన దారి లో వెళ్తుండడం తెలంగాణ రాజకీయాల్లో ఒకింత చర్చనీయాశంగా మారింది.
అదును చూసి దెబ్బ కొడుతున్నాడు
ఇక దీనికి తోడు ఆలోచనతో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి అదును చూసి దెబ్బ కొడుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే లందరికీ టికెట్లు ఇవ్వాలని కెసిఆర్ ను డిమాండ్ చేశాడు. అయితే ఈ డిమాండ్ లో తెలివైన ఎత్తుగడ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా చెప్పారు. అయితే పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రం సిట్టింగ్లకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మీ పనితీరు మార్చుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలకు క్లాసు పీకారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి కేసిఆర్ స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్ ప్రకారం కెసిఆర్ సిట్టింగ్లకు టికెట్లు ఇస్తే అప్పుడు తన డిమాండ్ ప్రకారం కేసీఆర్ టికెట్లు ఇచ్చాడని రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు. ఒకవేళ టికెట్లు ఇవ్వని పక్షంలో వారందరికీ కాంగ్రెస్ లోకి వెల్కమ్ చెబుతాడు. టికెట్లు ఇస్తాడా ఇవ్వడా అనేది పక్కన పెడితే వారిలో ఒక భరోసా కల్పిస్తాడు. అప్పుడు కేసీఆర్ మాట తప్పిన వాడు అవుతాడు. ఇక తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని పరోక్షంగా ఒప్పుకుంటాడు. ఒకవేళ కెసిఆర్ నా సొంత పార్టీకి సంబంధించిన విషయాలు మీద నీకెందుకు అంత అక్కసు అని ప్రశ్నిస్తే.. కెసిఆర్ గత చరిత్రను రేవంత్ రెడ్డి తవ్వుతాడు.. అంటే ఏ లెక్కన చూసినా రేవంత్ రెడ్డి కెసిఆర్ స్టైల్ లోనే రాజకీయం చేస్తున్నాడు. మరి దీనికి కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో వేచి చూడాలి