CM Revanth Reddy: కాళేశ్వరంతో చెక్.. బీఆర్ఎస్ పై బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల ముందు నుంచి ఉధృతంగా ప్రచారం చేస్తూ వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఇప్పుడు ప్రత్యేక పోకస్‌ పెట్టింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించనున్నట్టు ప్రకటించారు.

Written By: Raj Shekar, Updated On : December 17, 2023 10:24 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన మేడిగడ్డ బ్యారేజీపై రేవంత్‌ సర్కార్‌ దృష్టిపెట్టింది. సరిగ్గా ఎన్నికల సమయంలో కుంగిన బ్యారేజీ బీఆర్‌ఎస్‌కు శాపంగా మారింది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది. ఇక కొలువు దీరిన రేవంత్‌ సర్కార్‌ ఇప్పుడు అదే మేడిగడ్డ ద్వారా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను మరింత ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అప్పడు అన్ని విషయాలు బయటపడతాయని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ కూడా మేడిగడ్డకు తీసుకెళ్లి చూపిస్తామని తెలిపారు.

అవినీతి వెలికి తీసేలా..
ఎన్నికల ముందు నుంచి ఉధృతంగా ప్రచారం చేస్తూ వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఇప్పుడు ప్రత్యేక పోకస్‌ పెట్టింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించనున్నట్టు ప్రకటించారు. శాసన మండలిలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ‘‘మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటాం. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. అవినీతిని వెలికి తీసేలా దృష్టిపెడతాం. కాంట్రాక్టులు ఎవరిచ్చారు..? వారి వెనుకున్న మంత్రులు ఎవరు..? ఇందులో అధికారుల పాత్ర ఏంటీ.. ఇలా అన్ని విషయాలను బయటకు తీస్తాం’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా..
ఇదిలా ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని.. ఆ ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారిందని కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల సమయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాయి. ప్రధాని మోదీ సైతం అవినీతి పనులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇక కాళేశ్వరంలో సుమారు లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. తాము అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై లోతైన విచారణ చేపట్టి.. అన్ని డబ్బులు కక్కిస్తామంటూ రేవంత్‌రెడ్డి సహా హస్తం నేతలంతా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ఈ విషయంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

స్పందించిన ఎమ్మెల్సీ కవిత
ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గవర్నర్‌ ప్రసంగంపై స్పందించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ఉభయ సభల్లో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ జరిగిందని ఆమె పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారని ఆమె అన్నారు. రెండు సార్లు ఓట్లేస్తే గెలిచి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై గవర్నర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నిరంకుశ, నిర్బంధ ప్రభుత్వంగా దూషించారని ఫైర్‌ అయ్యారు. ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు.

మేడిగడ్డపై విచారణ గురించి..
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్‌ పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపడుతామని స్పష్టం చేశారు. కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటామని అన్నారు. సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌ ఇచ్చారు. అదేమైనా పర్యాటక కేంద్రమా? అందరిని తీసుకెళ్లడానికి అని ఆమె రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.