HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి అంత ఈజీగా నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే హైడ్రాను తీసుకొచ్చింది ఇలా మధ్యలో వదిలిపెట్టడానికి కాదు.. రంగనాథ్ లాంటి నిజాయితీపరుడైన అధికారిని ఇలా మధ్యలో విడిచిపెట్టడానికి కాదు.. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని.. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డికి తెలుసు. అందువల్లే రంగనాథ్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో చెరువులు ఆక్రమణ జరిగింది నిజం. రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతుంది కూడా నిజమే. ఇలాంటి సమయంలో అలాంటి అక్రమార్కుల మీద ఉక్కు పాదం మోపిన అధికారిగా రంగనాథ్ కు పేరు ఉంది. రంగనాథ్ మీద బిల్డర్లు చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారు. రకరకాల విధాలుగా ఇబ్బంది పెట్టారు. న్యాయస్థానాల మెట్లు కూడా ఎక్కారు. కోర్టులకు తప్పుడు ఆధారాలు ఇచ్చారు. ఇవన్నీ పరిశీలించిన సింగిల్ బెంచ్ .. రంగనాథ్ ను పక్కకు తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరిగినప్పటికీ కూడా రేవంత్ ప్రభుత్వం రంగనాథ్ కు అండగా ఉంటుంది.
న్యాయ నిపుణులు చెప్పిన వివరాలను పరిశీలిస్తే.. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలులోకి వచ్చేలా చేసే కంటే ముందుగానే చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ సింగిల్ బెంచ్ ఆదేశాల మీద స్టే గనుక ఇస్తే.. అప్పుడు హైడ్రాను చట్టబద్ధమైన ఇండిపెండెంట్ సంస్థ.. దీనికి సంబంధించిన నియామకాలు.. ఇతర వ్యవహారాలు ప్రభుత్వ కార్యనిర్వాహక పరిధి లోకి వస్తాయని బలమైన వాదనలు వినిపించడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ కూడా సానుకూలమైన తీర్పు రాకపోతే.. అప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. హైడ్రా విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అర్థమయ్యేలా చెప్పవచ్చు.. అదే కాదు ఒక అధికారి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా.. మార్చాలి అని చెప్పడం సహేతుకం కాదు అనే విషయాన్ని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది.. సాధారణంగా ప్రభుత్వానికి నమ్మకమైన అధికారులు కావాలి. అలాంటి వారిని కాపాడుకోవడానికి ప్రభుత్వ అధినేతలు అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. రంగనాథ్ విషయంలో కూడా రేవంత్ ఇలానే వ్యవహరిస్తారని సమాచారం. ఎలాగైనా సరే హైడ్రా అధిపతిగా రంగనాథ్ ను మాత్రమే కొనసాగించే విధంగా రేవంత్ బలంగా అడుగులు వేస్తున్నట్టు తాజా పరిణామాల ద్వారా తెలుస్తోంది.






